breaking news
-
అనకాపల్లి: ‘ఎర్నాకుళం’ మృతుడికి పరిహారం ప్రకటించిన రైల్వే
సాక్షి, అనకాపల్లి: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాద ఘటనలో ఒకరు మరణించారని.. మిగతా ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని అధికారులు ధృవీకరించారు. అలాగే మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో సహాయక చర్యలు పూర్తైనట్లు ప్రకటించారు. టెక్నికల్ క్లియరెన్స్ అనంతరం.. ప్రమాదానికి గురైన రెండు బోగీలతో పాటు మరొక బోగీని(ఎం2 కూడా) మినహాయించడంతో సోమవారం ఉదయం 7గంటలు ఆలస్యంగా రైలు ఎర్నాకుళం బయల్దేరింది.టాటానగర్(జార్ఖండ్) నుంచి ఎర్నాకుళం(కేరళ) వెళ్తున్న ఎక్స్‌ప్రెస్(18189) రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఎలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును నిలుపుదల చేశారు. ప్రయాణికులంతా బయటకు దిగి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈలోపు లోకో పైలట్ కాలిపోతున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. సమాచారం అందుకున్న అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లికి చెందిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా.. మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. తొలుత బీ1 కోచ్‌లోనే మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. అర్ధరాత్రి 3.30గంటలు దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన రెండు బోగీలను తొలగించి, ఆయా బోగీల్లోని ప్రయాణికులను మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి రైలును పంపించడానికి ప్రయత్నాలు చేయబోయారు. కానీ.. దుప్పట్ల వల్లే..ప్రమాద స్థలానికి చేరుకున్న దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డీఆర్ఎం మోహిత్ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘‘ప్రమాదం జరిగిన ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.30గం. ప్రాంతంలో ప్రమాదం జరిగింది. బీ1 కోచ్‌లో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నాం. ఆ బోగీలో దుప్పట్లు ఉండడం వల్ల మంటలు శరవేగంగా వ్యాపించాయి. రెండు బోగీలు(బీ1, ఎం2) పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో బీ1లో 76 మంది, ఎం2లో 82 మంది ఉన్నారు. ప్రమాదంలో ఒకరు మరణించారు. బీ1 బోగీలో మృతదేహాన్ని గుర్తించాం. ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రేకులు పట్టేయడం వల్లే మంటలు చెలరేగాయని లోకో పైలట్లు చెబుతున్నారు. కానీ, అధికారిక దృవీకరణ జరగాల్సి ఉంది. ఘటనపై విచారణ జరుగుతోంది’’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. మృతుడ్ని విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్(70)గా అధికారులు నిర్ధారించారు. ఆయన కుటుంబానికి రైల్వేశాఖ రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రయాణికుల అవస్థలుఈ ఘటన తర్వాత.. చలిలో సుమారు 2వేల మంది ప్రయాణికులు స్టేషన్లో పడిగాపులు పడ్డారు. అనకాపల్లి, తుని, విశాఖ స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పూరి-తిరుపతి, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, జన్మభూమి ఎక్స్‌ప్రెస్, బెంగళూర్ హంసఫర్ రైళ్లు వీటిల్లో ఉన్నాయి. ప్రయాణికులు ఈ విషయం గమనించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.ఎఫ్ఎస్ఎల్ ఆధారాలే కీలకంప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఉదయం ఘటన స్థలానికి రైల్వే సేఫ్టీ కమిటీ చేరుకుంది. ప్రమాద తీవత్రను సీనియర్ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రెండు ఫోరెన్సిక్ బృందాలు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. ఫైర్ సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారని ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. దర్యాప్తులో ఎఫ్ఎస్ఎల్ ఆధారాలే కీలకమని పోలీసులు చెబుతున్నారాయన. ‘‘ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు జరిపి సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకున్నాం. ప్రత్యేక బస్సుల్లో రైల్వే స్టేషన్‌కు తరలించాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఎర్నాకులం చేరేలా చూస్తాం’’ అని తెలిపారు.కలెక్టర్ కామెంట్స్.. రైలు ప్రమాద ఘటనపై కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ.. ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది. యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చే సరికి ప్రెషర్ తేడాలను లోకో పైలెట్ గుర్తించారు. అప్పటికే పొగలు వ్యాపించడంతో ప్రయాణీకులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులకు జిల్లా యంత్రాంగం తరపున ప్రయాణీకులకు ఆహారం, మంచినీటి సౌకర్యం కల్పించాం. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా ప్రమాద కారణాలు తెలుస్తాయి అన్నారు. -
ప్రాణాలు తీసిన సరదా
కూనవరం: అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం నర్సింపేటలో ఆదివారం జరిగిన ఒక చిన్న పొరపాటు, ఒకేసారి తండ్రీకొడుకులను బలితీసుకుని ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మండలంలోని నర్సింగపేట గ్రామానికి చెందిన సింహాద్రి పాపారావు (40), కుమారుడు జశ్వంత్(14)తో కలిసి సరదాగా పెంచుకుంటున్న కోడిపుంజులను ఈత కొట్టించేందుకు పొలం వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నీటికుంటలో కోళ్లను ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు కుమారుడు జశ్వంత్ కాలుజారి కుంటలో పడిపోయాడు. కళ్లముందే కొడుకు మునిగిపోతుంటే చూడలేకపోయిన తండ్రి, ఈత రాకపోయినా ప్రాణాలకు తెగించి నీటిలోకి దూకాడు. దురదృష్టవశాత్తు ఇద్దరూ ఆ నీటిలోనే ఊపిరి వదిలారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకేసారి విగతజీవులుగా మారారు. ఇంటర్ చదువుతున్న కూతురు, భర్తను కోల్పోయిన భార్య.. మాకు దిక్కెవరు?.. అంటూ బోరున విలపిస్తున్న తీరు అక్కడున్న వారిని కన్నీటి పర్యంతం చేసింది. పోలీసులు మృతదేహాలను కోతులగుట్ట సీహెచ్‌సీకి తరలించారు. బహిర్భూమికి వెళ్లి ప్రమాదానికి గురైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలావుండగా జశ్వంత్ మర్రిగూడెం హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. -
మృత్యువులోనూ వీడని స్నేహం
భీమడోలు: ఆ యువకులు ముగ్గురూ మంచి స్నేహితులు.. ముగ్గురూ కలిసి శుభకార్యాలకు ఫ్లవర్ డెకరేషన్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పనిలో భాగంగా ముగ్గురూ కలిసే వెళ్తారు. శనివారం తెల్లవారుజామున డెకరేషన్ పుష్పాల కోసం వెళ్లి బైక్‌పై తిరిగి వస్తున్న వారిని ఏలూరు జిల్లా భీమడోలు వద్ద జాతీయ రహదారిపై ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఏలూరు నుంచి పొలసానిపల్లి వైపుగా ముగ్గురు యువకులు కలిసి వెళ్తుండగా వీరి బైక్ భీమడోలు వద్ద ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వీరిలో ద్వారకాతిరుమల మండలం తిమ్మపురానికి చెందిన మాండ్రోజు చరణ్‌కుమార్ (26), ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన సయ్యద్ రఫీ (22), కొయ్యగర శ్రీరాములు అలియాస్ బన్నీ (21) ఉన్నారు. ఘటనాస్థలంలో నెత్తుటి మడుగులో ఉన్న బిడ్డలను చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్ఐ ఎస్కే మదీనా బాషా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.దట్టమైన పొగమంచే కారణమా ?ద్వారకాతిరుమలలో ఆదివారం జరిగే ఓ ఫంక్షన్‌కు డెకరేషన్ కోసం పువ్వుల కొనుగోలుకు చరణ్‌కుమార్ తన తమ్ముడి కొత్త బైక్‌పై రఫీ, బన్నీతో కలిసి శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లాడు. ఏలూరులో ఫ్లవర్స్ ఆర్డర్ ఇచ్చి తిరిగి వస్తున్న వీరు భీమడోలు ఫ్లైఓవర్ సమీపంలో చనిపోయారు. దట్టమైన పొగమంచు కురుస్తుండడం కూడా ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భీమడోలు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుప్పం నియోజకవర్గంలో కీచకపర్వం
చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఓ వివాహితపై ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన 10 రోజుల అనంతరం వెలుగులోకి వచ్చింది. బాధితురాలికి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.కుప్పం పోలీస్ స్టేషన్లో బాధితురాలి భర్త ఫిర్యాదు చేశారు. కుప్పం మండలం ఎన్. కొత్తపల్లి పంచాయతీ నిమ్మకంపల్లి గ్రామంలో ఘటన జరిగింది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న మరో నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.విషయం బయటకు చెప్తే.. తన కుటుంబాన్ని అంతం చేస్తామని నిందితులు బెదిరించారని బాధితురాలి భర్త తెలిపారు. దీంతో నా భార్య విషయం బయటకు చెప్పలేక 10 రోజులుగా మానసికంగా కుంగిపోయింది. నన్ను చంపేస్తామని, నా పిల్లలని చంపుతామని నా భార్యను బెదిరించారు’’ అని బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ఓ’ పాజిటివ్‌కు బదులు ‘ఏ’ పాజిటివ్ బాలింత మృతి
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా, నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రిలో ఇటీవల సంచలనంగా మారిన బాలింత మృతిపై జరిగిన విచారణలో దారుణ వాస్తవాలు వెల్లడయినట్లు తెలుస్తోంది. రక్త మార్పిడి విషయంలో ప్రభుత్వ డాక్టర్, బ్లడ్ బ్యాంక్ అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని విచారణలో తేలినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామానికి చెందిన సాగరమ్మ (21) పురిటినొప్పులతో ఈ నెల 15వ తేదీన నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు వచ్చింది. 17న కాన్పు చేశారు. శస్త్రచికిత్స తర్వాత ఆమెకు ‘ఓ’ పాజిటివ్ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఏరియా వైద్యశాలలో నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తాన్ని తీసుకువచ్చారు. అయితే రక్తం ఎక్కించే సమయంలో ఆమె శరీరంపై దద్దుర్లు రావడం ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర నిర్లక్ష్యం ‘ఓ’ పాజిటివ్ బదులుగా ‘ఏ’ పాజిటివ్ రక్తం ఎక్కించడం వల్లే ఈ ఘటన జరిగిందని ఇందుకు సంబంధించి విచారణలో వెల్లడయినట్లు తెలిసింది. దీంతో రక్త గ్రూప్ నిర్ధారణ, క్రాస్ మ్యాచ్, డబుల్ చెక్.. వంటి ముఖ్య విధానాలను అటు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది.. ఇటు వైద్యులు విస్మరించారన్న విషయం స్పష్టమైంది. విచారణ నేపథ్యంలో తప్పు మాది కాదంటే మాది కాదంటూ ఇటు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, అటు వైద్యులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా వీరిపై చర్యలు తీసుకోవద్దంటూ ఉన్నతాధికారులపై అధికార పార్టీ నేత ఒకరు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. బ్లడ్ బ్యాంక్‌పై డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణసైతం పూర్తిగా కొరవడినట్లు విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇచ్చి వివాదాన్ని సర్ధుమణిగింపచేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. త్వరలో చర్యలు.. బాలింత మృతిపై విచారణ జరిపి నివేదికను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, వైద్యశాఖ ఉన్నతాధికారులకు పంపించాం. బాధ్యులపై త్వరలో చర్యలుంటాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం. – ఎం ప్రసూన, డీసీహెచ్ఎస్, పల్నాడు జిల్లా -
మృత్యు ‘వే’గం.. రక్తమోడిన రహదారులు
రహదారులు శుక్రవారం తెల్లవారుజామున రక్తమోడాయి. అతివేగం, నిద్రమత్తు ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అదుపుతప్పిన కారు.. ప్రైవేటు బస్సును ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంలో వెనుక నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు రోడ్డు పక్కగా ఆగుతున్న కారును బలంగా ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ రెండు ఘటనలు బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. నిద్రమత్తే యమపాశమై.. దొర్నిపాడు: నంద్యాల జిల్లా ఎన్‌హెచ్–40పై ఆళ్లగడ్డ సమీపంలో డ్రైవర్ నిద్రమత్తు వల్ల కారు అదుపు తప్పి డివైడర్‌ను క్రాస్ చేసి మరో రూట్లో వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులంతా క్యాటరింగ్ పనులు చేసుకుని జీవించేవారు. హైదరాబాద్ బాచుపల్లికి చెందిన గుండేరావు(46), శ్రావణ్(21), సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన నరసింహులు(30), కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన సిద్ధయ్య(50)తోపాటు గుండేరావు కుమారులు సిద్ధార్థ కులకరి్ణ(19), శివసాయి కులకర్ణి ఈనెల 11న అయ్యప్ప భక్తులకు వంట చేసేందుకు శబరిమలైకి కారులో వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగించుకొని తిరుగు ప్రయాణంలో తిరుమలకు వెళ్లారు. స్వామి దర్శనం చేసుకొని గురువారం సాయంత్రం కారులో తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. శుక్రవారం తెల్లవారుజామున 2.30గంటల ప్రాంతంలో నల్లగట్ల వద్ద డ్రైవింగ్ చేస్తున్న శివసాయి కులకర్ణి నిద్రమత్తులో కునుకు తీయడంతో వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని మరో రూట్లో హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో గుండేరావు, శ్రావణ్, నరసింహులు, సిద్ధయ్య అక్కడికక్కడే మరణించారు. సిద్ధార్థ కులకర్ణి, శివసాయి కులకర్ణి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు. క్షతగాత్రులిద్దరిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించి సిద్ధార్థ కులకర్ణి మృతి చెందాడు. ఘటనాస్థలంలో చనిపోయిన నలుగురిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడే పోస్టుమార్టం పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు.ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 40 మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళుతున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రమాదంలో వీరెవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు బస్సును పోలీసు స్టేషన్‌కు తరలించి ప్రయాణికులను ఇతర వాహనాల్లో వారి గమ్యస్థానాలకు చేర్చారు.ప్రైవేటు బస్సే మృత్యుశకటమైగుంటూరు రూరల్: వెనుక నుంచి వచ్చిన ప్రైవేటు బస్సు కారును బలంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం, మామిళ్ళమడవ గ్రామానికి చెందిన కంచనపల్లి మధు స్థానికంగా వంటమేస్త్రీ. ఆయనకు భార్య మనీష, పిల్లలు జ్ఞానేశ్వర్, వర్షిత్ ఉన్నారు. పిల్లలిద్దరికీ పుట్టు వెంట్రుకలు తీయించేందుకు తిరుమల వెళ్లాలని కారు మాట్లాడుకున్నారు. కారులో మధు భార్యాబిడ్డలతోపాటు తల్లిదండ్రులు కంచనపల్లి సుశీల(64) వెంకటయ్య(70) మనీష తండ్రి మన్సూర్, కారు డ్రైవర్ సైదులు(28) మంగళవారం సాయంత్రం ఇంటివద్దనుంచి తిరుమల వెళ్లారు. తిరుపతిలో పిల్లల కార్యక్రమాలు పూర్తి చేసుకుని గురువారం సాయంత్రం విజయవాడకు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం సమీపంలోకి చేరింది. ఆ సమయంలో డ్రైవర్ సైదులు నిద్ర వస్తుందని కారును పక్కకు తీసి ముఖం కడుక్కుని వెళ్దామని చెప్పాడు. కారును రోడ్డుపక్కన ఆపేందుకు స్లో చేస్తుండగా వెనుకనుంచి అతి వేగంగా వస్తున్న వీఆర్‌సీఆర్ సంస్థకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును బలంగా ఢీకొంది. ప్రమాదంలో సుశీల, వెంకటయ్య, డ్రైవర్ సైదులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలినవారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కారు డోర్లను రాడ్లతో వంచి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను జీజీహెచ్‌కు తరలించారు. ఎస్పీ వకుల్ జిందాల్, సౌత్‌జోన్ డీఎస్పీ భానోదయ, నల్లపాడు సీఐ వంశీధర్ ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. -
గుంటూరులో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, గుంటూరు: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే నిలిపిన కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.వివరాల మేరకు.. గుంటూరు జిల్లాలోని నల్లపాడు స్టేషన్ పరిధి అంకిరెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. కాగా, మృతులను తెలంగాణలోని నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం తర్వాత మృతదేహాలను జీజీహెచ్‌కు తరలించినట్టు నల్లపాడు పోలీసులు తెలిపారు. -
రాజోలులో విషాదం.. ముసలమ్మతల్లి ఉత్సవ ప్రారంభంలో అపశ్రుతి
సాక్షి, రాజోలు: పొట్టకూటి కోసం ఉత్సవాల్లో వేషధారణలు వేసి భక్తులను ఆనందింపజేసే కళాకారిణి ప్రమాదవశాత్తు భవనం మెట్లపై నుంచి జారిపడి మృతి చెందింది. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన పాలపర్తి భవ్యశ్రీ (17) ప్రాణాలు కోల్పోయింది. రాజోలు మండలం శివకోటి ముసలమ్మతల్లి ఉత్సవాల ప్రారంభంలో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. గురువారం శివకోటి ముసలమ్మతల్లి అమ్మవారి ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నుంచి పలువురు కళాకారులు శివకోటి చేరుకున్నారు.వీరంతా వేషధారణల కోసం ఆలయానికి ఎదురుగా ఉన్న మూడు అంతస్తుల కల్యాణ మండప భవనంలోనికి వెళ్లారు. ఈ క్రమంలో తెల్లవారుజామున భవ్యశ్రీ ప్రమాదవశాత్తు కల్యాణ మండపం మెట్లపై నుంచి జారిపడి తలకు బలమైన గాయమైంది. ఆమెను హుటాహుటీన రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సహ కళాకారిణి మృతిపై సహచరులు, మృతురాలి తల్లి చినపాప ఆస్పత్రి వద్ద రోదించిన తీరు కంటతడి పెట్టించింది. యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్‌కుమార్ తెలిపారు. యువతి మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. అసంపూర్తి భవనంలో బసపై అగ్రహం అసంపూర్తిగా నిర్మించిన కల్యాణమండపంలో కళాకారులకు బస ఏర్పాటు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం మెట్లకు రెయిలింగ్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఉత్సవ కమిటీ నిర్లక్ష్యం వల్లే కళాకారిణి మృతి చెందిందని వారు వాపోయారు. -
పెప్పర్ స్ప్రే కొట్టి భర్తపై భార్య దాడి
విశాఖ సిటీ: తన భార్య, కుమార్తె, ఆమె స్నేహితుడు తనపై పెప్పర్ స్ప్రే కొట్టి, దాడికి పాల్పడ్డారని దీపాటి జార్జ్ మార్టిన్ అనే వ్యక్తి మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు.. మారి్టన్(56) భార్య హన్నా మార్టిన్, ఇద్దరు పిల్లలతో పాండురంగాపురం ప్రాంతంలో నివాసముంటున్నారు. భార్య పేరు మీద ఒక ఇంజనీరింగ్ కంపెనీని ప్రారంభించి, కాంట్రాక్టు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల నుంచి భార్య హన్నా మార్టిన్ ఆ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆయన చేసిన కాంట్రాక్టు పనుల బిల్లులు సదరు కంపెనీ అకౌంట్లోనే పడడంతో వాటిని తీసుకునే అవకాశం మారి్టన్కు లేకుండా పోయింది. నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన మారి్టన్ తన తల్లి, కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. మంగళవారం పని మీద ఇంటికి వెళ్లడంతో అక్కడ భార్య, కుమార్తె, అమె స్నేహితుడు మార్టిన్‌పై పెప్పర్ స్ప్రే కొట్టి దాడి చేశారు. అతడి కాలు, చేతికి గాయాలవడంతో కేజీహెచ్‌లో చికిత్స చేయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాన్నా.. మేమేం పాపం చేశాం!
బొమ్మనహాళ్: తండ్రే ఆ చిన్నారుల పాలిట కాలయముడయ్యాడు. దేవాలయానికి తీసుకెళ్తానని ఇద్దరినీ కాలువలో తోసేశాడు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లుకు చెందిన శిల్ప, కల్లప్పకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కల్లప్ప కూలి పనులు చేస్తుంటాడు. కుమార్తెలు సింధు (11), అనూష (9) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6, 5 తరగతులు చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇంటివద్దే ఉన్న కుమార్తెలను కల్లప్ప ఆలయానికి తీసుకెళ్లాడు. కర్ణాటకలోని సిరిగేరి క్రాస్ వద్ద తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) వద్దకు వెళ్లాక సింధును నీటిలోకి తోసేశాడు. చిన్న కుమార్తె అనూష గమనించి భయంతో పరుగులు తీయగా.. కల్లప్ప వెంబడించి మరీ పట్టుకుని కాలువలోకి విసిరేశాడు. ఏమీ తెలియనట్టు సోమవారం గ్రామానికి చేరుకున్నాడు. పిల్లలు ఏమయ్యారని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా సమాధానం రాలేదు. మంగళవారం ఉదయమైనా పిల్లలు రాకపోయేసరికి బంధువులు, గ్రామస్తులు గట్టిగా నిలదీశారు. దీంతో మద్యం మత్తులో ఉన్న కల్లప్ప సిరిగేరి క్రాస్ వద్ద ఎల్లెల్సీ కాలువలో తోసేశానని ఓసారి.. గ్రామ సమీపంలోని హెచ్చెల్సీలోకి తోసేశానని మరోసారి చెప్పాడు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, కర్ణాటక, ఆంధ్ర పోలీసులు కాలువలో గాలించగా మంగళవారం మధ్యాహ్నం సింధు మృతదేహాన్ని దమ్మూరు సమీపంలోని ఎల్లెల్సీవద్ద గుర్తించి బయటకు తీశారు. చిన్నమ్మాయి అనూష జాడ కోసం గాలిస్తున్నారు. -
రాయదుర్గం: ఇద్దరు కూతుళ్లను చంపిన తండ్రి
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గంలో ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇద్దరు కూతుళ్లను చంపిన కసాయి తండ్రి కల్లప్ప.. బళ్లారి సమీపంలోని హైలెవల్ కెనాల్లో తోసేశాడు. చిన్నారుల అనసూయ (9), చంద్రకళ (10) మృతి చెందారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లులో ఘటన జరిగింది.దైవ దర్శనం కోసమని చెప్పి ఇద్దరు కూతుళ్లను చంపిన కల్లప్పకు దేహశుద్ధి చేసిన స్థానికులు.. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
పశ్చిమగోదావరి జిల్లా: ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర మండలం పోలమూరు గ్రామంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అతివేగంతో రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ప్రమాదంలో పోలమూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ (28), అంజిబాబు (25), రాజు (19) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురూ ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.స్థానికుల కథనం ప్రకారం, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం అర్ధరాత్రి 12.30 సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న పెనుమంట్ర పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పంచనామా నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని స్థానికులు చెబుతుండగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సీఐపై కత్తితో యువకుడు దాడి
రాప్తాడురూరల్: అనంతపురం నగర శివార్లలో కాల్పుల మోత సంచలనం కలిగించింది. రెండు హత్యాయత్నాల కేసుల్లో నిందితున్ని పట్టుకోవడానికి వెళ్లిన సీఐపై కత్తితో దాడి చేయడంతో.. ప్రతిఘటించే క్రమంలో సీఐ తన సర్విస్ రివాల్వర్‌తో కాలి్చన సంచలన ఘటన అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి సమీపంలో జరిగింది. వివరాలు.. అనంతపురం నగరం నాయక్‌నగర్‌కు చెందిన చాకలి రాజా, సొహైల్, అక్రం, అజయ్ స్నేహితులు. వీరు ఆదివారం రాత్రి 8.15 గంటల సమయంలో నగరంలోని అరవిందనగర్‌లో అయ్యప్ప కేఫ్ వద్ద మద్యం సేవిస్తుండగా గొడవపడ్డారు. ఈక్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అజయ్ తన స్నేహితుడు చాకలి రాజాను కత్తితో కడుపులో బలంగా పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు అజయ్ కోసం గాలింపు చేపట్టారు. మఫ్టీలో వెళ్లిన పోలీసులపై దాడికి యత్నం.. నిందితుడు అజయ్ సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో టీవీ టవర్ సమీపంలోని షికారు కాలనీలో ఉన్నాడనే సమాచారం అందడంతో ఇన్ఫార్మర్ ఆటోడ్రైవర్ బాబాను వెంట బెట్టుకుని టూటౌన్ సీఐ శ్రీకాంత్, ఎస్ఐ రుష్యేంద్రబాబు, సిబ్బంది మఫ్టీలో వెళ్లారు. పోలీసులు రౌండప్ చేయడాన్ని పసిగట్టిన అజయ్.. తన దగ్గరికి వస్తున్న ఆటోడ్రైవరు బాబాను ఒక్కసారిగా కత్తితో పొడిచాడు. ఆపై వీరంగం సృష్టిస్తూ మహిళలను కత్తితో బెదిరిస్తూ ముళ్లపొదల్లోకి దూరి పారిపోయాడు. చెరుకు తోటలో నక్కి ఉండి.. సీఐపై అటాక్.. వరుసగా దాడులకు పాల్పడుతున్న అజయ్‌ను పట్టుకోవాలని సవాల్‌గా తీసుకున్న పోలీసులకు ఆకుతోటపల్లి సమీపంలోని కందుకూరుకు వెళ్లే దారిలో ఓ చెరుకుతోటలో నిందితుడు దాక్కున్నట్లు సమాచారం రావడంతో చుట్టూ మోహరించారు. చెరుకు తోట ఏపుగా ఉండడంతో సీఐ శ్రీకాంత్ లోపలకు వెళ్లి లొంగిపోవాలని కోరాడు. అయితే సీఐ దగ్గరకు సమీపిస్తుండగా అజయ్ ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో భుజానికి గాయమైంది. మరోమారు దాడి చేసేందుకు రావడాన్ని గమనించిన సీఐ అప్రమత్తమై తన సర్విస్ రివాల్వర్‌తో రెండు రౌండ్లు కాల్చాడు.ఒక బుల్లెట్ అజయ్ మోకాలిలో దూరి బయటకు రావడంతో అక్కడే పడిపోయాడు. మరోవైపు సీఐ శ్రీకాంత్ గాయపడడంతో అక్కడే ఉండగా సిబ్బంది అక్కడికి చేరుకుని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అజయ్ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, సీఐ శ్రీకాంత్ పై యువకుడు కత్తితో దాడి చేయడాన్ని ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఓ ప్రకటనలో ఖండించారు. అజయ్‌పై హత్యాయత్నం కేసు: ఎస్సీ జగదీష్ సీఐ శ్రీకాంత్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడు అజయ్‌పై ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. సీఐ శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై రెండు కేసులు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని పరిశీంచిన ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ నిందితుడిపై గతంలోనూ క్రిమినల్ కేసులున్నాయన్నారు. చట్టపరంగా నిందితుడిపై కఠిన చర్యలతో పాటు వారి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. -
అనంతపురంలో కాల్పుల కలకలం
సాక్షి, అనంతపురం: జిల్లాలోని ఆకుతోటపల్లిలో సోమవారం కాల్పుల కలకలం రేగింది. ఓ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన టౌటౌన్ సీఐ శ్రీకాంత్‌పై దాడి యత్నం జరిగింది. దీంతో ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా సీఐ కాల్పులు జరపడంతో నిందితుడు గాయపడ్డాడు. స్థానికంగా ఉన్న అజయ్ అనే వ్యక్తి నిన్న మద్యం మత్తులో ఓ యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు కావడంతో అజయ్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లారు. అయితే నిందితుడు సీఐ శ్రీకాంత్‌పై కత్తితో దాడికి యత్నించగా.. ఆయన తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. దీంతో అజయ్ కాలు నుంచి తూటా దూసుకెళ్లింది. ఈ ఘటనలో సీఐ శ్రీకాంత్‌కు సైతం గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
టీచర్‌తో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం..!
నరసరావుపేట టౌన్: సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన కానిస్టేబుల్ దారితప్పారు. తన భార్యతో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం పెట్టుకొని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, అతని నుంచి రక్షణ కల్పించాలని భర్త తమ పిల్లలతో కలిసి ఫిర్యాదు చేశారు. అధికారులు అందుబాటులో లేరని ఫిర్యాదు ఇచ్చేందుకు మరో రోజు రావాలని సిబ్బంది వెనక్కు పంపారు. పల్నాడు జిల్లా గురజాల సబ్ డివిజన్లోని ఓ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లాలో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ తాను నివాసం ఉండే సమీపంలో ఉంటున్న ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలితో గత కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. విషయం భర్తకు తెలిసి కానిస్టేబుల్‌ను నిలదీయడంతో అతనిపై బెదిరింపులకు దిగారు. దీంతో భర్త తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని శనివారం ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లారు. పిడుగురాళ్లలో నిర్వహిస్తున్న శ్రీనివాస కల్యాణ కార్యక్రమం విధుల నిమిత్తం అధికారులు వెళ్లడంతో స్టేషన్లో అందుబాటులో లేరు. అధికారులను కలిసి ఫిర్యాదు చేసేందుకు భర్త గంటలకొద్దీ వేచి ఉన్నా రాలేదు. మరో రోజు రావాలని సిబ్బంది ఫిర్యాదు స్వీకరించకుండా వెనక్కు పంపారు. దీర్ఘకాలంగా ఒకే స్టేషన్లో పనిచేస్తూ స్టేషన్లో రికార్డు వర్క్ చేస్తున్న ఆ కానిస్టేబుల్‌పై గతంలో కూడా అనేక అవినీతి ఫిర్యాదులు ఉన్నాయి. అయితే అధికారులకు నెలవారీ మామూళ్లు వసూళ్లు చేయటంలో సదరు కానిస్టేబుల్ కీలక పాత్ర పోషిస్తుండటంతో అధికారులు అతని అక్రమాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానిస్టేబుల్ ఆగడాలపై పల్నాడు జిల్లా ఎస్పీని సోమవారం కలిసేందుకు బాధితుడు సిద్ధమైనట్లు సమాచారం. -
విజయవాడలో మళ్లీ డ్రగ్స్ కలకలం
సాక్షి, అమరావతి: విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మాచవరం పీఎస్ పరిధిలో డ్రగ్స్ సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు అర్థరాత్రి అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులను నుంచి ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన మరో నిందితుడు అనూహ్యంగా పోలీసుల అదుపులో నుంచి పరారైనట్లు తెలుస్తోంది. విజయవాడలోని ఓ హోటల్లో నిందితులు ముగ్గురు డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరి నుంచి మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి వారు ఉపయోగించిన కారుతో సహా స్టేషన్‌కు తరలించారు. అయితే కారు పార్కు చేసి రావాలని నిందితుడికే తాళాలు అప్పగించడంతో అతడు పరారైనట్లు తెలుస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయవాడలోని మధురానగర్, సింగ్‌నగర్‌కు చెందిన నిందితులిద్దరూ ఇంటర్ తర్వాత చదువు మానేసి చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. స్నేహితుల పార్టీల్లో వీళ్లకు ఎండీఎంఏ అలవాటైంది. అలా తరచూ బెంగళూరు వెళ్లి అక్కడ కొని విజయవాడ తెచ్చి స్నేహితులతో కలిసి తీసుకునేవారు. ఈనెల 19న కారులో వీరిద్దరూ బెంగళూరుకు బయలుదేరారు. 20న అక్కడకు చేరుకున్నారు. అక్కడ ఓ వ్యక్తి వద్దకు వెళ్లి రూ.36వేలు చెల్లించి 19 గ్రాముల డ్రగ్స్ కొనుగోలు చేశారు.వీరు బెంగళూరు వెళ్లిన విషయాన్ని నిందితుల్లో ఒకడి స్నేహితుడి ద్వారా నెల్లూరుకు చెందిన మరో యువకుడు తెలుసుకున్నాడు. వెంటనే ఫోన్ చేసి తనకు తెలిసిన వ్యక్తి నుంచి 2 గ్రాముల ఎండీఎంఏ తీసుకురావాలని కోరాడు. అయితే.. అప్పటికే బెంగళూరులో ఉన్న నిందితుల్లో ఒకడు పోలీసుల నిఘా ఉందని చెప్పాడు. తర్వాత బతిమిలాడి ఒప్పించి డబ్బులు పంపించాడు. బెంగళూరు నుంచి రెండు గ్రాములు తీసుకుని కారులో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో నెల్లూరులో దిగి ఎండీఎంఏ ఇచ్చారు. అక్కడవారు కొంత డ్రగ్స్ తీసుకున్నారు. అయితే.. కారు మొరాయించడంతో అక్కడే వదిలేసి, నెల్లూరుకు చెందిన నిందితుడి కారులో ముగ్గురూ విజయవాడ చేరుకుని మాచవరం స్టేషన్ పరిధిలోని ఓ హోటల్లో దిగారు. అక్కడ ముగ్గురూ డ్రగ్స్ తీసుకుని మత్తులో మునిగి తేలారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు హోటల్‌పై దాడి చేసి, వీరిని పట్టుకుని 10 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఎండీఎంఏ అమ్మిన ఇద్దరి కోసం మరో బృందం బెంగళూరు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నగరంలో ఈ మధ్యకాలంలో ఇలాంటి వ్యవహారాలు తరచూ వెలుగు చూస్తుండడం గమనార్హం. అయినా కూడా మాదకద్రవ్యాలు కట్టడి చేయలేకపోతున్నారంటూ పోలీస్ శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం
విశాఖపట్నం: సింహాచలం సింహపురి కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేలోపే ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుల గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
విజయవాడలో ‘10 రూపాయల’ హత్య
సాక్షి, విజయవాడ: విజయవాడలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు రూ.10 రూపాయలు ఇవ్వలేదని తాతని మనవడు హత్య చేశాడు. హత్య చేసిన బాలుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. విజయవాడ కొత్తపేట పీఎస్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న వృద్ధుడ్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు.నగరంలో ఈ ఘటన కలకలం రేపింది. మృతుడు తాపీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆయన స్వస్థలం మంగళగిరి నుకలపేట కాగా ఉపాధి నిమిత్తం విజయవాడలో ఉంటున్నాడని పోలీసులు చెప్పారు.మరో ఘటనలో బందరు లాకులు వద్ద అనుమానాస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతి చెందినవారు యాచకులుగా స్థానికులు చెబతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. -
అల్లుడితో కలిసి భర్తను చంపిన భార్య
నంద్యాల (అర్బన్): అల్లుడుతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ అల్లుడితోనే కలిసి తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన గురువారం నంద్యాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన సుభద్ర, గుర్రప్ప(40) దంపతులు ఐదేళ్లుగా నంద్యాల శివారులోని నందమూరినగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు తువ్వపల్లె గ్రామానికి చెందిన లింగమయ్యతో మూడేళ్ల క్రితం వివాహం చేశారు.ఈ క్రమంలో సుభద్రకు అల్లుడైన లింగమయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి భర్త గుర్రప్ప పలుమార్లు సుభద్రను హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. రోజూ ఇంట్లో గొడవ జరుగుతుండటంతో గుర్రప్పను హతమార్చాలని సుభద్ర కుట్ర పన్నింది. గురువారం ఇంట్లో పడుకుని ఉన్న గుర్రప్ప మెడకు సుభద్ర, లింగమయ్య తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపారు. గుర్రప్ప తల్లి సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు భార్య సుభద్రను అరెస్ట్ చేయగా, లింగమయ్య పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
బ్యాంక్ దోపిడీకి స్కెచ్
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి రింగ్ రోడ్డులోని కెనరా బ్యాంక్‌లో దోపిడీకి ఏడుగురు ఆగంతకులు స్కెచ్ వేశారు. బ్యాంక్‌ను దోచుకోవడానికి పట్టపగలు తుపాకులతో చొరబడ్డారు. బ్యాంక్ సిబ్బంది అప్రమత్తమై అలారం ఆన్ చేయడంతో భయపడి దుండగులు పరారయ్యారు. వివరాలు.. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అనకాపల్లి రింగ్ రోడ్డులోని కెనరా బ్యాంక్‌కు ఏడుగురు వచ్చారు. అప్పటికే కొంత మంది ఖాతాదారులు బ్యాంకులో ఉన్నారు. వచ్చిన ఏడుగురిలో ఇద్దరు గేటు వద్ద వేచి ఉండగా.. ఐదుగురు లోపలకు ప్రవేశించారు.కొంత సేపు వారు లోపల అన్ని విభాగాలను పరిశీలించారు. వీరిలో ఒకరు బ్యాంక్ మేనేజర్ దగ్గరకు, మరో వ్యక్తి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి తుపాకులు తీసి బెదిరించారు. ఈ పరిణామంతో బ్యాంకులోని ఖాతాదారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది తేరుకుని సైరన్ మోగించారు. దీంతో దొంగలు వెంట తీసుకొచి్చన ద్విచక్ర వాహనాలపై రైల్వే స్టేషన్ మీదుగా పారిపోయారు. బ్యాంక్ అధికారులు అనకాపల్లి పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీసులు బ్యాంకుకు చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. -
పసి పిల్లలను విక్రయిస్తున్న ముఠా ఆటకట్టు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఢిల్లీ, ముంబైల నుంచి పసి పిల్లలను తీసుకొచ్చి, పిల్లలులేని దంపతులకు విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టుచేశారు. ఏకకాలంలో దాడులు నిర్వహించి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై నగరంలోని కొత్తపేట, భవానీపురం, నున్న పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు నమోదుచేశారు. నిందితుల నుంచి ఐదుగురు పసిపిల్లలతోపాటు, రూ.3.30 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు గురువారం మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.విజయవాడ సితార సెంటర్‌కు చెందిన బలగం సరోజిని సులభంగా డబ్బులు సంపాదించేందుకు పిల్లల్లేని వారికి అక్రమంగా పిల్లలను విక్రయించడాన్ని ఎంచుకుంది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన కిరణ్‌శర్మ, ముంబైకి చెందిన కవిత, నూరి, సతీష్ ఆమెకు పరిచయమయ్యారు. వారు అక్కడి నుంచి పసిపిల్లలను తీసుకొచ్చి సరోజినికి ఇచ్చేవారు. ప్రతిఫలంగా వారికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వరకూ సరోజిని ఇచ్చేది. ఇలా తీసుకొచ్చిన చిన్నారులను తిరిగి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయించేది. వీరికి విజయవాడలో మరికొందరు కూడా జతకలిశారు. వీరంతా గతంలో అరెస్టయి జైలుకు వెళ్లొచ్చారు. అమ్మకానికి సిద్ధంగా ఉండగా.. ఇక ఢిల్లీకి చెందిన కిరణ్‌శర్మ, భారతిల నుంచి ఇద్దరు పిల్లలను.. ముంబైకి చెందిన కవిత, నూరి, సతీష్ ల నుంచి మరో ముగ్గురు పిల్లలను సరోజిని తీసుకొచ్చి అమ్మకానికి సిద్ధంగా ఉంచింది. అయితే, పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబుకు ఈ విషయం తెలిసింది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ కె. లతాకుమారి, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, నార్త్ ఏసీపీ స్రవంతిరాయ్ల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్, భవానీపురం, నున్న ఇన్స్పెక్టర్లు ఏకకాలంలో దాడులు నిర్వహించి కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో ఐదుగురిని, నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉడా కాలనీలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నలుగురు పిల్లలను, రూ.3.30 లక్షల నగదును స్వా«దీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి విజయవాడలో వివిధ ప్రాంతాలకు చెందిన బలగం సరోజిని (31), గరికముక్కు విజయలక్ష్మి (41), వాడపల్లి బ్లెస్సీ, ఆముదాల మణి, షేక్ ఫరీనా, వంశీకిరణ్కుమార్, శంక యోహాన్, పతి శ్రీనివాసరావు, సత్తెనపల్లికి చెందిన షేక్ బాబావలి, తెలంగాణలోని ఘట్కేసర్కు చెందిన ముక్తిపేట నందిని.. మొత్తం పదిమందిని అరెస్టుచేసినట్లు సీపీ తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవీ సరిత, ఏడీసీపీలు జి. రామకృష్ణ, ఏసీపీ కె. లతాకుమారి, ఎన్వీ దుర్గారావు, స్రవంతి రాయ్, పలువురు సీఐలు పాల్గొన్నారు. -
ఇంట్లోకి చొరబడి మహిళపై హత్యాయత్నం
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): బెజవాడలో గంజాయి బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే రాళ్లు, క్రికెట్ బ్యాట్లు, కారం చేత పట్టుకొని ఏకంగా ఇళ్లల్లోకి చొరబడి ఓ మహిళను హతమార్చేందుకు యత్నించారు. గంజాయి మత్తులో వీరు చేసిన వీరంగంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ లూనాసెంటర్లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గుమ్మళ్ల కుసుమ అనే మహిళ సింగ్‌నగర్‌లోని నార్త్‌జోన్ తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం సమీపంలో 20 ఏళ్లుగా ఉంటోంది. బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో టీవీ చూస్తుండగా గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు లోనికి ప్రవేశించాడు. చీరను లాగి ఆమెపై హత్యాయత్నానికి యత్నించాడు. దీంతో ఆమె అతడిని బయటకు తోసేసి తలుపులు వేసింది. విషయాన్ని సమీపంలో ఉన్న తన అన్నయ్య శేఖర్‌కు ఫోను చేసి చెప్పింది. ఇంతలో ఆ వ్యక్తితోపాటు మరో ఇద్దరు గంజాయి బ్యాచ్ సభ్యులు, ఓ మహిళ కూడా వారితోపాటు వచ్చి రాళ్లు, బ్యాట్, కారంతో వీరంగం సృష్టించారు. మహిళను, ఆమె కుమారుడిని చంపేస్తామంటూ ఇంటిపైకి రాళ్లు రువ్వారు. అద్దాలు, తలుపులు, కిటికీలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. వీరి చేష్టలకు భయపడి స్థానికులు ఇళ్లల్లోకి పరుగులు తీశారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులపైనా రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ పోలీసులపైనా గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. తమకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అండదండలు ఉన్నాయని హూంకరించింది. వారు చెప్పినట్లుగానే స్థానిక టీడీపీ నాయకులు కొందరు గొడవ జరిగిన కాసేపటికే అక్కడకు చేరుకొని నిందితులను రక్షించేందుకు యత్నించారు. వారిపై కేసులు పెట్టవద్దంటూ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. వీడియోల రూపంలో సాక్ష్యాధారాలు ఉన్నా కేసులు కట్టేందుకు పోలీసులు వెనుకాడుతున్నారు. రాజీ పడాల్సిందిగా బాధితులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. విషయం మీడియాకు, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హత్యాయత్నం కాకుండా చిన్న చిన్న సెక్షన్ల కింద కేసులు కట్టి చేతులు దులుపుకునేందుకు యత్నిస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు. -
వివాహేతర సంబంధం.. అత్తపై కోడలు దాడి
కోనేరుసెంటర్: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న అత్తను ప్రియుడితో కలిసి కోడలు హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. అత్త చనిపోయిందని భావించి ప్రియుడితో కలిసి మూడేళ్ల బాలుడితో మహిళ పరారైంది. అయితే కొన ఊపిరితో ప్రాణాలు నిలబెట్టుకున్న వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన నలపాల సురేష్ లిఖిత భార్యాభర్తలు, వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. సురేష్ తల్లి పార్వతి కొడుకు వద్దే ఉంటుంది. సురేష్ నగరంలోని ఓ పెట్రోల్‌బంకులో పనిచేస్తుంటాడు. సురేష్ ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు. మూడేళ్ల బాబుతో పరారీ.. అందరూ నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి సురేష్ ఇంట్లోకి చొరబడ్డాడు. గాఢ నిద్రలో ఉన్న పార్వతిపై దాడి చేశాడు. దెబ్బలకు తట్టుకోలేక పార్వతి బిగ్గరగా కేకలు పెడుతూ ఇంట్లో ఉన్న లిఖితను పిలిచింది. లిఖిత ఎంతకీ బయటకు రాలేదు. ఆమెను చంపేందుకు రకరకాలు ప్రయత్నిస్తుండగా పార్వతి అతని దాడిని ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్నట్లు నటించిన లిఖిత కారం తెచ్చి ఆ వ్యక్తి చేతికి ఇవ్వటంతో అత్త కళ్లల్లోకి విసిరాడు. అనంతరం ఇద్దరు ఆమెను అంతమొందించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.చివరికి పార్వతి అపస్మారకస్థితికి చేరుకోగా చనిపోయిందనుకుని భావించిన లిఖిత ఆ వ్యక్తితో కలిసి తన మూడేళ్ల బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. గాయాలపాలైన పార్వతి సమీపంలో బంధువుల ఇంటికి విషయం చెప్పగా వారు సురేష్‌కు జరిగిన విషయం చెప్పారు. దీంతో సోమవారం చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గుర్తుతెలియని వ్యక్తితో పాటు లిఖిత కోసం గాలిస్తున్నట్లు సీఐ ఎస్కే నబీ తెలిపారు. -
పెళ్లి కాదనే బెంగతో యువకుడి ఆత్మహత్య
గార్లదిన్నె/అనంతపురం సిటీ: కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇక తనకు పెళ్లి కాదనే బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన భీమన్నగారి చిదంబర కుమారుడు ప్రతాప్(31) వ్యవసాయ పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. తన ఈడు పిల్లలందరూ పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడగా.. తనకు ఇంకా పెళ్లి కాకపోవడంతో కుంగిపోయాడు. తనకు పెళ్లి చేయాలని ఇంట్లో అడుగుతూ వస్తున్నా... అప్పులు ఎక్కువగా ఉన్నాయని, అవి తీరాక పెళ్లి చేస్తామంటూ కుటుంబ సభ్యులు వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ప్రతాప్ ఆదివారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి గార్లదిన్నె రైల్వేగేట్ సమీపంలో గ్వాలియర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న యశ్వంత్‌పూర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్ నుంచి సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ వెంకటేష్ సోమవారం అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
కుటుంబ కలహాలతో తల్లీబిడ్డ ఆత్మహత్య
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కుటుంబ కలహాలతో ఓ తల్లి కన్నకొడుకుతో మృత్యుఒడిలోకి చేరింది. ఈ ఘటన ఆదివారం చిత్తూరు మండలం తుమ్మింద గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు... తుమ్మింద గ్రామానికి చెందిన బాబు భార్య కవిత్ర (26)కు అయిదేళ్ల కిందట వివాహం అయింది. ఈ దంపతులకు ముకేష్ (04) అనే కుమారుడు జన్మించాడు. శనివారం ఈ దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కవిత్ర సాయంత్రం గ్రామ సమీపంలోని బావిలో కుమారుడుతో పాటు దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్య, కుమారుడు ఇంట్లో కనిపించకపోవడంతో భర్త, కుటుంబీకులు ఊరంతా గాలించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఊరికి సమీపంలోని బావిలో శవమై తేలారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కుమార్ తదితులున్నారు.


