పేదరిక నిర్మూలన..  మా దృఢమైన నిబద్ధత  | PM Narendra Modi Claims 50 Crore Indians Lifted Out Of Poverty | Sakshi
Sakshi News home page

పేదరిక నిర్మూలన..  మా దృఢమైన నిబద్ధత 

Nov 2 2026 6:24 AM | Updated on Nov 2 2026 6:24 AM

PM Narendra Modi Claims 50 Crore Indians Lifted Out Of Poverty

దేశంలో తీవ్ర పేదరికం తగ్గడం హర్షణీయం: ప్రధాని మోదీ 

న్యూఢిల్లీ:  ప్రపంచంలోనే అత్యంత వేగంగా పేదరికం తగ్గుతున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటని పేర్కొంటూ ప్రపంచ బ్యాంకు నివేదిక విడుదల చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టుచేశారు. దీనికి బాలీవుడ్‌ చిత్రం ‘దాస్వి’లోని స్ఫూర్తిదాయకమైన ‘థాన్‌ లియా’పాటను నేపథ్య సంగీతంగా ఉపయోగించారు. 

పేదరికంలో వచ్చిన ఈ చారిత్రాత్మక తగ్గుదల, ఒక తరం తర్వాత మరో తరానికి అవకాశాలు పెరగడాన్ని సూచిస్తోందని వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దశాబ్దాల నాటి ‘గరీబీ హఠావో’నినాదాన్ని మోదీ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వానికి పేదరిక నిర్మూలన అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అదొక దృఢమైన నిబద్ధత అని తేల్చిచెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పేదరికం తగ్గుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటిగా నిలిచిందని, ప్రపంచ బ్యాంకు కూడా ఇదే విషయాన్ని చెబుతోందని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు గణాంకాలను ప్రస్తావించారు. 

2011 నుండి 2023 మధ్య కాలంలో 49.6 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని, దీనివల్ల తీవ్ర పేదరిక రేటు 90 శాతం తగ్గిందని వివరించారు. అంటే, గతంలో ప్రతి నలుగురు భారతీయులలో ఒకరికి పైగా తీవ్ర పేదరికంలో ఉండగా, నేడు సుమారు ప్రతి 38 మంది భారతీయులలో ఒకరికి మాత్రమే ఆ పరిస్థితి ఉందని ఉద్ఘాటించారు. కేవలం ఆరు సంవత్సరాల్లోనే ఉపాధి అవకాశాలు 13.4 కోట్లు పెరిగాయని, ఇది మన దేశంలోని పని చేయగల వయస్సు గల జనాభాలో నమోదైన పెరుగుదల కంటే దాదాపు రెట్టింపు అని తెలియజేశారు. దేశంలో అసమానతలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. ‘ఇండియా పావర్టీ అండ్‌ ఈక్విటీ బ్రీఫ్‌: అక్టోబర్‌ 2026’అనే పేరుతో ప్రపంచ బ్యాంక్‌ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారతదేశంలో తీవ్ర పేదరిక రేటు 2011లో 27.1 శాతంగా ఉండగా, 2023 నాటికి అది 2.6 శాతానికి తగ్గింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement