కోచి: స్నేహితుల వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన కేసులో ప్రముఖ యూట్యూబర్ నిహాద్ అలియాస్ తొప్పిపై కేరళ సైబర్ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అలువా రూరల్ సైబర్ పోలీసులు ఎర్నాకుళం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టులో ఈ ఛార్జ్‌షీట్ సమర్పించారు. ఈ కేసులో నిందితుడిపై ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్నేహితులతో ఏర్పడిన వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో నిహాద్ వారి ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై పలువురు ఫిర్యాదులు చేయడంతో రాష్ట్ర డీజీపీ సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా వీడియోలు అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ ఛానల్‌ను తొలగించాలని పోలీసులు యూట్యూబ్ సంస్థకు లేఖ రాశారు. దీంతో సంబంధిత ఛానల్‌ను యూట్యూబ్ తొలగించింది.
గతంలో ఈ కేసు విచారణకు హాజరుకావాలని నిహాద్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన విచారణకు రాకపోవడంతో లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. అనారోగ్య కారణాలను చూపుతూ విచారణకు హాజరుకాలేనని ఆయన తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. నిహాద్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. తాజాగా పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఈ కేసు కీలక దశకు చేరుకుంది.
ఇదీ చదవండి: ‘జనశతాబ్ది’కి సూపర్‌ఫాస్ట్ హోదా రద్దు.. కారణమిదే!


