ప్రపంచ పరిణామాలు కీలకం  | Expert' forecast on market trends for the week | Sakshi
Sakshi News home page

ప్రపంచ పరిణామాలు కీలకం 

Sep 21 2026 5:15 AM | Updated on Sep 21 2026 5:15 AM

Expert' forecast on market trends for the week

రష్యా చమురు ఆంక్షల చట్టంతో కొత్త సవాలు 

వైట్‌ హౌస్‌లో ట్రంప్‌–జిన్‌పింగ్‌ భేటీపై దృష్టి 

వంద డాలర్లపైనే బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 

బీఎస్‌ఈలో ఎన్‌ఎస్‌ఈ లిస్టింగ్‌పైనా ఫోకస్‌ 

ఈ వారం మార్కెట్‌ గమనంపై నిపుణుల అంచనా

ముంబై: అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ సరళిని నిర్దేశిస్తాయని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో చైనా ప్రెసిడెంట్‌ జిన్‌పింగ్‌ భేటీ, బాండ్లపై రాబడులు (ఈల్డ్స్‌), పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ క్రూడాయిల్‌ ధరల కదలికలు సెంటిమెంట్‌ను శాసించనున్నాయి. యూఎస్‌ లేబర్‌ మార్కెట్‌ డేటా ఇదే వారంలో విడుదల కానున్నాయి.  

నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సహా ఆరు కంపెనీల షేర్లు ఈ వారం ఎక్సే్ఛంజీల్లో అరంగేట్రం చేయనున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల క్రయవిక్రయాలు కూడా కీలకం కానున్నాయి. ‘రష్యా నుంచి ఇంధనం కొనే దేశాలపై 100% వరకు టారిఫ్‌లు విధించేలా అమెరికా తెచి్చన కొత్త చట్టం భారత్‌కు వాణిజ్య పరంగా కొత్త సవాలుగా మారింది. క్రూడ్‌ ధరలు, బాండ్‌ ఈల్డ్స్, భౌగోళిక–రాజకీయ పరిణామాలే ఈ వారం మార్కెట్లకు దారి చూపుతాయి’ అని ఎన్‌రిచ్‌ మనీ సీఈవో ఆనంద్‌ పొన్ముడి తెలిపారు. 

భారత్‌కు అమెరికా ‘ఆంక్షల’ ముప్పు 
రష్యా ఇంధన రంగాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా తెస్తున్న కొత్త ఆంక్షల చట్టం భారత్‌కు సవాలుగా మారింది. రష్యా నుంచి చమురు కొనే దేశాలపై 100% వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని ఈ చట్టం డొనాల్డ్‌ ట్రంప్‌కు కల్పిస్తుంది. రష్యా ఇంధనానికి ప్రధాన కొనుగోలుదారుగా ఉన్న భారత్‌.. ఈ దిగుమతులు తగ్గించుకోవాల్సి వస్తే దేశీ ఇంధన వ్యయాలు పెరిగి కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌) తీవ్రమవుతుంది. ఇది రూపాయి క్షీణతకు, ద్రవ్యోల్బణానికి దారితీసి స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది. పలితంగా ఇండియన్‌ ఆయిల్, రిలయన్స్‌ వంటి రిఫైనరీలతో పాటు పెయింట్స్, ఏవియేషన్, టైర్లు, లాజిస్టిక్స్‌ రంగాలు దెబ్బతినే ప్రమాదముంది. 

భయపెడుతున్న బాండ్‌ ఈల్డ్స్‌ 
గత వారంలో యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను 3.75–4%కి, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ 1.25 శాతానికి పెంచాయి. ఈ రేట్ల పెంపుతో అమెరికా పదేళ్ల బాండ్‌ రాబడులు (ఈల్డ్స్‌) మళ్లీ 5 శాతానికి చేరుకున్నాయి. దీంతో డాలర్‌ బలపడి, గ్లోబల్‌ మార్కెట్లలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) తగ్గుతోంది. ఇది రూపాయి క్షీణతకు, ఎఫ్‌ఐఐ నిధుల ఉపసంహరణకు దారితీస్తోంది.

వంద డాలర్ల ఎగువనే క్రూడ్‌ ధరలు 
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య ఇప్పటికీ బ్యారెల్‌కు 100 డాలర్ల ఎగువనే కొనసాగుతున్నాయి. భారత్‌కు అధికంగా దిగుమతయ్యే బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 103.87 వద్ద స్థిరపడింది.ఆరు లిస్టింగులు, ఆరు ఐపీఓ ప్రభావం  ఈ వారం ప్రాథమిక మార్కెట్లో ఏకంగా ఆరు ఐపీఓలు, ఆరు లిస్టింగ్‌లతో సందడి వాతావరణం నెలకొనుంది. వీటిలో ప్రధానంగా రూ.22,562 కోట్ల  ఎన్‌ఎస్‌ఈ ఆఫర్‌ సోమవారంతో ముగిసి, గురువారం బీఎస్‌ఈలో లిస్ట్‌ కానుంది. ఈ మెగా ఇష్యూతో పాటు మిగిలిన అయిదు ఐపీఓల వల్ల ప్రాథమిక మార్కెట్లోకి భారీగా నిధులు తరలిపోతున్నాయి. దీనివల్ల నగదు ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) తగ్గడం సెకండరీ మార్కెట్‌పై తాత్కాలిక ప్రభావం చూపవచ్చు.

సాంకేతిక అంశాలు  
ఈ వారంలో నిఫ్టీకి 23,000–23,100 స్థాయి అత్యంత కీలకమైన మద్దతు (సపోర్ట్‌) శ్రేణిగా ఉంది. గత ఆరు వారాలుగా పతనమవుతున్న మార్కెట్‌.. మళ్లీ పుంజుకుంటుందా..? లేక మరింత క్షీణతను చవిచూస్తుందా? అనేది నిఫ్టీ 23,000 స్థాయి వద్ద నిలదొక్కుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నిఫ్టీ 22,950 స్థాయి కంటే దిగువకు పడిపోతే 22,400–22,600 స్థాయిల వరకు పతనమయ్యే అవకాశముంది. ఒకవేళ మార్కెట్‌ కోలుకుంటే ఎగువన నిఫ్టీకి 23,500–23,800 వద్ద తక్షణ నిరోధం (రెసిస్టెన్స్‌) ఎదురుకావచ్చు.

ఆరో వారమూ నష్టాల పరంపర 
దేశీయ ఈక్విటీ మార్కెట్లను నష్టాల పరంపర వీడటం లేదు. క్రూడ్‌ సెగ, బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల ప్రభావంతో వరుసగా ఆరో వారమూ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. గత వారంలో సెన్సెక్స్‌ 428 పాయింట్లు , నిఫ్టీ 53 పాయింట్లు చొప్పున పడ్డాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement