Adilabad: ఇది మీనాక్షి ఊరు.. సినిమాల్లోనే ఇలాంటి పల్లె ఉంటుందా? అదేం కాదు.. | Sakshi
Sakshi News home page

Meenakshi Gadge: ఇది మీనాక్షి ఊరు.. సినిమాల్లోనే ఇలాంటి పల్లె ఉంటుందా? అదేం కాదు..

Published Wed, Mar 1 2023 9:55 AM

Adilabad: Mukhra Sarpanch Meenakshi Gadge To Facilitated By President Why - Sakshi

Mukhra Sarpanch Meenakshi Gadge Inspiring Journey: ఆదిలాబాద్‌ జిల్లాలోని ముఖరా అనే చిన్న పల్లెను చూస్తే సినిమాల్లోనే ఇలాంటి పల్లె ఉంటుంది అనిపిస్తుంది. మూడేళ్లలో దీనిని ఇలా తీర్చిదిద్దింది సర్పంచ్‌ మీనాక్షి గాడ్గె. అందుకే ఆమెకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందింది.ఎందుకో చదవండి...

నూట అరవై కుటుంబాలు 700 జనాభా ఉన్న ఆ చిన్న ఊరు ఎంత ముచ్చటగా ఉంటుందంటే ప్రతి ఊరు ఇలాగే ఉంటే బాగుండు అనిపిస్తుంది. మూడేళ్ల క్రితం వరకూ అది అన్నింటిలాగే ఒక మామూలు పల్లె. మూడేళ్లలో దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచే స్థాయికి ఎదిగింది. దానికి కారణం సర్పంచ్‌ మీనాక్షి గాడ్గె. ఆమె కృషి, పట్టుదల  ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా గ్రామాన్ని అద్భుతమైన గ్రామంగా తీర్చిదిద్దాయి.  

నూతన గ్రామపంచాయతీ
ఒకప్పుడు అనుబంధ గ్రామంగా ఉన్న ముఖరా 2019లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. సర్పంచ్‌ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌ అయ్యింది. గ్రామ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న సుభాష్‌ గాడ్గె తన భార్య మీనాక్షిని సర్పంచ్‌గా పోటీ చేయమని ప్రోత్సహించాడు.

అక్షరాస్యత అంతంత మాత్రమే ఉన్న ఆ గ్రామంలో ఇంటర్‌ వరకూ చదివి అందరితో స్నేహంగా ఉండే మీనాక్షి ఆ పదవికి తగినదేనని ఊరంతా భావించింది. ఏకగ్రీవంగా ఆమెను సర్పంచ్‌గా ఎన్నుకుంది. ఈ నిర్ణయం మీనాక్షిని బాగా కదిలించింది. తన మీద ఇంత విశ్వాసం ఉంచిన గ్రామానికి  పూర్తిగా సేవ చేయాలని గట్టిగా నిశ్చయించుకుంది.

అన్నీ మంచి పనులే
మీనాక్షి సర్పంచ్‌ అయిన వెంటనే చేసిన మొదటి పని ఊళ్లో ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు కట్టించడం. దాంతో ఊరు ఒక్కసారిగా బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామంగా మారిపోయింది. ఆ తర్వాత తాగునీరు ప్రతి ఇంటికి అందేలా చేయడమే కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత ఏర్పాటు చేసి వృ«థానీరు ఆ గుంటలో పోయేలా చూసిందామె. దాంతో భూగర్భ జలాలు పెరిగాయి.

ఊరి బయట పెద్ద వాగు వానొస్తే పొంగి రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగేది. మీనాక్షి వంతెన కట్టించింది. పక్కా రోడ్ల నిర్మాణం, సైడు కాలువల వల్ల శుభ్రత ఏర్పడింది. పాత భవనంగా ఉన్న స్కూలును కొత్త భవన నిర్మాణం చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే కాదు ఇంగ్లిష్‌ మీడియంలో చెప్పడానికి టీచర్లను నియమించింది. దాంతో 1 నుంచి 5 వరకు ఊళ్లో ప్రతి ఒక్క విద్యార్థి ఈ ప్రభుత్వ బడిలోనే చదువుతున్నాడు. 

డయల్‌ 100కు ఒక్క కాల్‌ లేదు
‘గత మూడేళ్లుగా మా ఊరి నుంచి డయల్‌ 100కు ఒక్క కాల్‌ కూడా వెళ్లలేదు’ అంటుంది మీనాక్షి. దానికి కారణం సంపూర్ణ మద్యపాన నిషేధం విధించడమే. దాని వల్ల సగం గొడవలు లేకుండా పోయాయి. మద్యం తాగితే జరిమానా విధిస్తారు. అంతేకాదు గ్రామమంతా శాకాహారాన్ని అలవాటు చేసుకుంది. ఆరోగ్యం కోసం శాకాహారాన్ని ప్రచారం చేయడం వల్ల ఈ మార్పు వచ్చింది.

ఊరిలో చిన్న అంగడి కూడా నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తుంది. ఇక ఊరిలో నలభై వేల చెట్లు ఉన్నాయి. హరితహారంలో భాగంగా పదివేల మొక్కలు నాటి వాటిని పూర్తిగా కాపాడుకున్నారు. ఊళ్లోనే ఒక నర్సరీ ఉంది.  వీటన్నింటి వల్ల ఊరు చల్లటి నీడలో ఉంటుంది. ఇందువల్లేనేమో కరోనా ఈ ఊరు దరిదాపులకు రాలేదు.

మహిళా విజేత
ఇన్ని మంచి పనులు చేసింది కనుకనే మీనాక్షిని మార్చి 4న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛ సుజల్‌ శక్తి సమ్మాన్‌–2023’ కార్యక్రమంలో భాగంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ‘మహిళా విజేత’ పురస్కారంతో సత్కరించనుంది. ‘నా భర్త, పిల్లలు, ఊరి ప్రజలు... వీరందరి సహకారం వల్లే ఈ పురస్కారం’ అని మీనాక్షి అంది. 

చెత్తను ఎరువుగా అమ్మి
ముఖరాలో తడి చెత్త – పొడి చెత్త విభజనను ప్రతి ఒక్కరూ పాటిస్తారు.  తడి చెత్త నుంచి ఎరువు తయారు చేసి రైతులకు అమ్మి పంచాయతీకి లాభం సంపాదించిపెడుతోంది మీనాక్షి.

ఎరువు అమ్మకం ద్వారా 6 లక్షలు వస్తే వాటిలో నాలుగు లక్షలు వెచ్చించి ఊళ్లో 6 కె.వి. సోలార్‌ గ్రిడ్లు ఏర్పాటు చేసింది. ఇక్కడ తయారయ్యే కరెంటులో 4 కిలోఓల్టులు పంచాయతీ ఉపయోగించుకున్నా 2కిలో ఓల్ట్‌లను పవర్‌ గ్రిడ్‌కు అమ్మడం ద్వారా లాభం రానుంది. 
– ఇన్‌పుట్స్‌: గొడిసెల కృష్ణకాంత్‌ గౌడ్, సాక్షి, ఆదిలాబాద్‌
చదవండి: జంగిల్‌ రాణి..పద్మిని మాఝీ: అడవిని చేరాలంటే ఆమెను దాటాలి

Advertisement
 
Advertisement