దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్న దేవగుడి కుటుంబం | - | Sakshi
Sakshi News home page

దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్న దేవగుడి కుటుంబం

Nov 23 2026 5:36 AM | Updated on Nov 23 2026 5:36 AM

దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్న దేవగుడి కుటుంబం

జమ్మలమడుగు : జమ్మలమడుగు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ‘దేవగుడి రాజ్యాంగం’ అమలవుతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. తమ అనుమతి లేనిదే ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకూడదంటూ హుకుం జారీ చేస్తున్నారని, నామినేషన్లు వేసిన వారిపై కూటమి శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని విమర్శించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో కొండాపురం, ముద్దనూరు మండలాల్లో నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడంతోపాటు ముద్దనూరు మండలంలోని గంగాదేవిపల్లెలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై రౌడీ మూకలు దాడి చేసి హత్యాయత్నం చేయడంతో వారిని జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వారిని పరామర్శించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు

జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణరెడ్డి, నారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డిల ఆధ్వర్యంలో దౌర్జన్యపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు. సర్పంచ్‌ నామినేషన్ల మొదటి రోజు నుంచే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని అన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు సైతం అధికార పా ర్టీకి కొమ్ముకాస్తూ, నామినేషన్లు వేసే వారిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నా వారు ప్రేక్షకపాత్ర వహించడం బాధాకరమన్నారు. కొండాపురం మండలం ఓబన్నపేటకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు నామినేషన్లు వేసేందుకు రక్షణ కోరితే, కొండాపురం సీఐ రాజు కూటమి వర్గీయులతో రాళ్లు వేయించారని ఆరోపించారు.

దౌర్జన్యాలతో పదవులు సాధించుకున్నారు

రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజల మద్దతుతో గెలవలేమనే భయంతోనే అడ్డదారులు తొక్కారని విమర్శించారు. గతంలో ఎన్నికలు జరగకుండా దౌర్జన్యాలకు పాల్పడి చైర్‌పర్సన్‌తోపాటు రెండు జెడ్పీటీసీ పదవులను దేవగుడి కుటుంబీకులు దక్కించుకున్నారని ఆరోపించారు. భవిష్యత్తు తరాలకు కూడా దౌర్జన్య రాజకీయాలనే వారు నేర్పిస్తున్నారని అన్నారు. ప్రజలకు చేసిన మంచిని చెప్పుకొని ఓట్లు అడగాలి తప్ప, పోలీసులను అడ్డుపెట్టుకుని నామినేషన్లు వేయనివ్వకుండా చేయడం తగదని హితవు పలికారు. ప్రజలు ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో దౌర్జన్యాలకు పాల్పడిన ప్రతి ఒక్కరూ తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.

పోటీల్లో గెలవలేక దాడులకు తెగబడుతున్నారు

గంగాదేవిపల్లెలో వైఎస్సార్‌సీపీ నాయకులపై హత్యాయత్నం

ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement