కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో రైతుల ఆక్రందనలు అరణ్య రోదనగానే మిగులుతున్నాయి. రైతుల సంక్షేమం పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అసలే సకాలంలో వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్న రైతులకు ట్రాన్స్‌ఫార్మర్ల రూపంలో సరికొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు కావడంలో తీవ్ర జాప్యం జరుగుతుండగా, ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు వస్తే అందులో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముడుపులు ముట్టజెపితే తప్పా ఏ పని జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వర్షాలు కురవకపోవడంతో కొత్త బోర్లు వేసుకొని లేదా ఉన్న బోర్ల ద్వారా పొలాలకు నీటిని పారించి పంటలు పండించుకోవాలన్న రైతుల ఆశలకు విద్యుత్‌శాఖ అధికారులు కళ్లెం వేస్తున్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లకు దరఖాస్తు చేసి నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. కడప సర్కిల్‌లో ఇప్పటికీ సుమారు 1600 మంది రైతులు ట్రాన్స్‌ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసి వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. విద్యుత్ శాఖ గణాంకాలను బట్టి నెలకు 250–300 ట్రాన్స్‌ఫార్మర్లు మాత్రమే విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొబైల్ టీం తొలగింపు
జిల్లాలో ఎక్కడైనా రైతుల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినా, మరమ్మతులకు వచ్చినా మొబైల్ బృందం ద్వారా వాటిని మరమ్మతులు చేసేవారు. ఇందుకోసం ఒక ప్రత్యేక వాహనంతోపాటు నలుగురైదుగురు సిబ్బంది అందులో పనిచేసేవారు. వారు ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ను అక్కడే పరిశీలించి ఫీజు లు, లగ్గులు, కండక్టర్లు పోయినా అక్కడికక్కడే మార్చి వెంటనే పనిచేసేలా చర్యలు తీసుకునే వారు. ఏడాది క్రితం ఆ మొబైల్ టీంను తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో చిన్నదానికి పెద్దదానికి స్టోర్‌కు పరుగెత్తాల్సిన పరిస్థితి ఉంది. పొలాల నుంచి వాటిని బయటకు తెచ్చి స్టోర్స్‌కు తరలించడానికి, మళ్లీ దాని స్థానంలో మరొక ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకుపోయి అమర్చడానికి రైతులకు ప్రయాణ ఖర్చులు పెనుభారంగా మారుతున్నా యి. ఈ క్రమంలో ప్రతిచోటా విద్యుత్ సిబ్బంది చేయి తడపాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
డీఈ, ఏఈల ఆధ్వర్యంలో ప్రైవేటు ఎస్‌పీఎంలు
జిల్లాలో ఏపీఎస్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో ప్రతి డివిజన్‌లోనూ ఎస్‌పీఎం (స్పెషల్ మెయింటెనెన్స్ కేంద్రాలు) పనిచేస్తున్నాయి. ఇవిగాక ప్రైవేటు ఎస్‌పీఎంలు కూడా నడుస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల తరహాలోనే ఏపీఎస్‌పీడీసీఎల్ ఎస్‌పీఎంలు నడుస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలను మాత్రమే ఇక్కడ పరిష్కరించి, పెద్ద సమస్య అయితే దాన్ని రికార్డు చేసి ప్రైవేటు ఎస్‌పీఎంలకు తరలిస్తున్నారు. అయితే చిన్న సమస్య, పెద్ద సమస్య అనేది తెలియక ముందే చాలామంది ట్రాన్స్‌ఫార్మర్లను ప్రైవేటు ఎస్‌పీఎంలకు తరలిస్తున్నారని తెలుస్తోంది. కాగా చాలావరకు ప్రైవేటు ఎస్‌పీఎంలు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న డీఈ, ఏఈల ఆధ్వర్యంలో నడుస్తుండటం గమనార్హం. దీంతో చిన్న సమస్య ఉన్నప్పటికీ అది పోయింది, ఇది పోయింది అంటూ ప్రైవేటు ఎస్‌పీఎంలలో వేలకు వేలు బిల్లులు రాస్తున్నట్లు సమాచారం.
సాధారణంగా ఒక కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు కావాలంటే రెండు నుంచి నాలుగు నెలల కాలం పట్టే అవకాశం ఉందని విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసులు అన్నారు. కడపలాంటి చోట ఒక నెలలోనే ఇస్తున్నామని, మిగతా డివిజన్లలో కొంత ఆలస్యం జరుగుతోందని చెప్పారు. తాను రాక ముందే మొబైల్ టీంను తొలగించారని, ఆ టీం ఉంటే బాగుండేదని తెలిపారు.
కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు కావు... ఉన్నవి మరమ్మతులు జరగవు
ముడుపులు ఇవ్వనిదే
ఏ పని జరగడం లేదని ఆరోపణలు
ఇబ్బందులు పడుతున్న రైతులు


