బ్యాటర్ల హోరు.. టీమ్‌–ఎ, టీమ్‌–డి జట్ల గెలుపు | - | Sakshi
Sakshi News home page

బ్యాటర్ల హోరు.. టీమ్‌–ఎ, టీమ్‌–డి జట్ల గెలుపు

Nov 20 2026 1:43 AM | Updated on Nov 20 2026 1:43 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: ఏసీఏ అండర్‌–15 మహిళల (2026–27) రాష్ట్ర ప్రాబబుల్స్‌ వన్డే మ్యాచ్‌లలో బ్యాటర్లు బౌలర్లపై విరుచుకుపడ్డారు. బుధవారం జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో టీమ్‌–ఎ, టీమ్‌–డి జట్లు విజయాలు సాధించాయి.

అక్షయ శతకం

స్థానిక కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో టీమ్‌–ఎ, టీమ్‌–బి జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌–ఎ నిర్ణీత 35 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 327 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ అక్షయ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 74 బంతుల్లోనే 17 ఫోర్లు, 13 సిక్సర్లతో 167 పరుగులు చేసింది. ఆమెకు తోడుగా విశ్వశ్రీ (66) అర్ధ సెంచరీతో రాణించింది. టీమ్‌–బి బౌలర్లలో అక్షర 2, కార్తీక ఒక వికెట్‌ తీశారు. అనంతరం 328 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌–బి 35 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులకే పరిమితమైంది. జట్టులో లావణ్య (54), కార్తీక (53) అర్ధ సెంచరీలు చేసినా ఫలితం లేకపోయింది. టీమ్‌–ఎ బౌలర్లలో యశశ్రీ, రేష్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో టీమ్‌–ఎ 135 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

టీమ్‌–డి అలవోక విజయం

కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో టీమ్‌–సి, టీమ్‌–డి జట్లు పోటీపడ్డాయి. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన టీమ్‌–సి 34.1 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో యోధిక వెంకటశ్రీ (40), హర్షిత గౌడ (33) మాత్రమే రాణించారు. టీమ్‌–డి బౌలర్లు లక్ష్య మోహన్‌, మేఘన చెరో 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం 123 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమ్‌–డి 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యోషిత (41), చైత్ర (34) కీలక పరుగులు చేశారు. టీమ్‌–సి బౌలర్లలో వర్షిణి, హారిక, దిల్‌షా, శేష తలో వికెట్‌ దక్కించుకున్నారు. దీంతో టీమ్‌–డి 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement