ఎర్రగుంట్ల : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వివాహితను ఎర్రగుంట్ల రైల్వే పోలీసులు కాపాడారు. అనంతరం భార్యాభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహించి ఇంటికి పంపించిన ఘటన గురువారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరు పట్టణం దస్తగిరి పేటకు చెందిన జ్యేష్టాది సువర్ణ(29), అశోక్ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే అశోక్ గత రెండేళ్లుగా శ్రీనివాసనగర్‌కు చెందిన మరో యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఇదే విషయంపై బుధవారం భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన అశోక్ కత్తితో సువర్ణపై దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సువర్ణ ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయంతో గురువారం ఉదయం ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ప్లాట్‌ఫారమ్ చివరి భాగంలో అనుమానాస్పదంగా రైలు కోసం ఎదురుచూస్తున్న ఆమెను రైల్వే హెడ్ కానిస్టేబుల్ రాజారెడ్డి, ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ శివకుమార్ గుర్తించారు. వెంటనే ఆమె వద్దకు చేరుకుని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని నచ్చజెప్పి ఆమెను స్టేషన్‌కు తరలించారు. అనంతరం భర్త అశోక్‌తో పాటు ఇరువైపుల బంధువులను పిలిపించి పోలీసుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. భార్యాభర్తలిద్దరూ సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలని హితవు పలికి, సువర్ణను భర్త వెంట క్షేమంగా ఇంటికి పంపించారు. సకాలంలో స్పందించి మహిళ ప్రాణం కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు.


