హైకోర్టు ఆదేశాలకు తూట్లు.. నామినేషన్ల వేళ ఖాకీల గందరగోళం! | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఆదేశాలకు తూట్లు.. నామినేషన్ల వేళ ఖాకీల గందరగోళం!

Nov 20 2026 1:31 AM | Updated on Nov 20 2026 1:31 AM

● జిల్లాలో పంచాయతీ ఎన్నికల

నామినేషన్లపై పతాక స్థాయికి చేరిన రాజకీయ వేడి

● వేంపల్లెలో ప్రొద్దుటూరు డీఎస్పీ భద్రత నడుమ వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌

అభ్యర్థి షబ్బీర్‌ నామినేషన్‌

● అభ్యర్థిని స్టేషన్‌లోనే ఉంచాలంటూ పులివెందుల డీఎస్పీ సూచించినట్లు ఆరోపణలు!

టాస్క్‌ఫోర్స్‌: వైఎస్సార్‌ కడప జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ, రాజకీయ వేడి మధ్య సాగుతోంది. నామినేషన్లు వేయనివ్వకుండా అధికార పక్షం అడ్డుకుంటోందన్న ఆరోపణలతో అభ్యర్థులు పోలీసు రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు న్యాయస్థానాల స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అడ్డంకులు, అధికారుల మధ్య ఆదేశాల గందరగోళం స్థానికంగా చర్చనీయాంశమైంది.

వేంపల్లెలో పటిష్ట బందోబస్తు

నడుమ షబ్బీర్‌ నామినేషన్‌

వేంపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుతో బరిలోకి దిగిన షబ్బీర్‌ గురువారం భారీ పోలీసు బందోబస్తు మధ్య నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రొద్దుటూరు డీఎస్పీ బాలస్వామి రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తూ పటిష్ట భద్రత నడుమ అభ్యర్థిని నామినేషన్‌ కేంద్రానికి తీసుకెళ్లారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌ కుమార్‌ రెడ్డి, ఆయన సోదరుడు, మాజీ సర్పంచ్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, మరో మాజీ సర్పంచ్‌ ఆర్‌.శ్రీనివాసులు వెంటరాగా షబ్బీర్‌ నాలుగో సచివాలయంలో నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

స్టేషన్‌లోనే అభ్యర్థి..

అధికారుల మధ్య ఏం జరిగింది?

నామినేషన్‌ ప్రక్రియకు ముందు వేంపల్లె పోలీస్‌ స్టేషన్‌ వేదికగా ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల మధ్య జరిగినట్లు ప్రచారమవుతున్న ఫోన్‌ సంభాషణ కలకలం రేపింది. అభ్యర్థి షబ్బీర్‌కు భద్రత కల్పించేందుకు ప్రొద్దుటూరు డీఎస్పీ బాలస్వామి రెడ్డి ఆయనను వేంపల్లె స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ సమయంలో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ ఫోన్‌ చేసి.. ‘నాకు చెప్పకుండా నామినేషన్‌ ఎలా వేయిస్తారు?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. ఇందుకు బదులుగా తాను ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ ఆదేశాల మేరకే అభ్యర్థిని స్టేషన్‌కు తీసుకొచ్చానని బాల స్వామి రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్ప టికీ, తాను వచ్చేంతవరకు అభ్యర్థిని స్టేషన్‌లోనే ఉంచాలని మురళీ నాయక్‌ సూచించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వార్డు అభ్యర్థుల అడ్డగింతపై సతీష్‌ రెడ్డి ఫైర్‌

మరోవైపు, తమ పార్టీ బలపరిచిన వార్డు అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంపై ఎస్వీ సతీష్‌ కుమార్‌ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్‌ కేంద్రం వద్ద పులివెందుల, రాయచోటి, కమలాపురం, కదిరి ప్రాంతాల నుంచి టీడీపీ శ్రేణులు వందలాదిగా గుమిగూడి హంగామా చేస్తున్నాయని, బీటెక్‌ రవి చిన్నాన్న రఘునాథ్‌రెడ్డి నేతృత్వంలో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. 144 సెక్షన్‌ అమలులో ఉన్నప్పటికీ బయటి వ్యక్తులు పెద్ద సంఖ్య లో చేరినా పోలీసులు ఎందుకు నియంత్రించ డం లేదని నిలదీశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు శ్రీనివాసులు, విష్ణువర్దన్‌ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు షబ్బీర్‌ వలి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్‌. వేణుగోపాల్‌, మండల ఉపాధ్యక్షుడు మునీర్‌బాషా పాల్గొన్నారు.

పెద్దచెప్పలి నామినేషన్లపై

హైకోర్టు కీలక ఆదేశాలు

కమలాపురం మండలం పెద్దచెప్పలి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల వ్యవహారం ఏకంగా హైకోర్టుకు చేరింది. టీడీపీ నాయకులు, వారి అనుచరులు తమకు ప్రాణహాని బెదిరింపులకు పాల్పడుతూ నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ సర్పంచ్‌, వార్డు అభ్యర్థులు షేక్‌ షబ్నం, గౌస్‌ ఆజం తదితరులు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. సర్పంచ్‌, వార్డు అభ్యర్థులు, వారి ప్రతిపాదకులు నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేసేలా పటిష్ట పోలీసు రక్షణ కల్పించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.

క్షేత్రస్థాయిలో అమలుపై ఉత్కంఠ

నామినేషన్ల దాఖలుకు నవంబర్‌ 20వ తేదీ (శుక్రవారం) చివరి రోజు కావడంతో జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ప్రజాస్వామ్యబద్ధంగా సాగాల్సిన నామినేషన్ల ప్రక్రియ కోసం అభ్యర్థులు పోలీసు భద్రతపై, న్యాయస్థానాల ఆదేశాలపై ఆధారపడాల్సి రావడం గమనార్హం. హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారమైనా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి అభ్యర్థులకు రక్షణ కల్పిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement