● కో–ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక వాయిదా
● జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగా నిర్ణయించిన ప్రకారం జెడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలను నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించాల్సి ఉంది. అయితే.. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు సమయాన్ని మార్పు చేసి 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే, అదే రోజు జరగాల్సిన కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నిక వాయిదా పడిందని ఎన్నికల అధికారి తెలిపారు. కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నిక నిర్వహణ తేదీని తదుపరి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఖరారు చేసి ప్రకటించడం జరుగుతుందన్నారు.
ముగిసిన ఎంపీపీ
ఎన్నికల ఘట్టం
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ గురువారం ఉత్కంఠ నడుమ జరిగింది. 35 మండలాల్లో విజేతలను ఎన్నుకోగా, కోరం లేకపోవడం, సాంకేతిక కారణాలతో మరికొన్ని చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.
నేటికి వాయిదా పడ్డ మండలాలు:
బి.కోడూరు, వీరబల్లి, సింహాద్రిపురం మండలాల ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
పులివెందులలో: ఎంపీపీ పదవికి రిజర్వ్ అయిన ఎస్టీ కేటగిరీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు లేకపోవడంతో ఇక్కడ ఎన్నిక జరగలేదు.


