● మూడో విడతలో 13 మండలాల్లో 235 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు
● ఓటు హక్కు వినియోగించుకోనున్న 4,55,393 మంది
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. గురువారం 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు చేపట్టారు. మూడో విడతలో జిల్లాలోని 13 మండలాల్లో 235 గ్రామ పంచాయతీల సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, ఇందుకోసం 2,364 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,55,393 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
13 మండలాల్లో..
మైదుకూరు మండలంలో 13, బి.మఠం మండలంలో 11, చాపాడు మండలంలో 22, దువ్వూరు మండలంలో 23, జమ్మలమడుగు మండలంలో 14, కొండాపురం మండలంలో 24, ముద్దనూరు మండలంలో 19, మైలవరం మండలంలో 19, పెద్దముడియం మండలంలో 22, ప్రొద్దుటూరు మండలంలో 15, రాజుపాలెం మండలంలో 15, ఎర్రగుంట్ల మండలంలో 17, ఖాజీపేట మండలంలో 21 గ్రామ పంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలాల్లోని 235 గ్రామ పంచాయతీల పరిధిలో 2,364 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 64 క్లస్టర్లలో అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు.
నవంబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ
నవంబర్ 21 నుంచి 23వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన , 25 నామినేషన్లపై అప్పీల్, నవంబర్ 26న అప్పీళ్ల పరిష్కారం ఉంటుంది. 27 నామినేషన్ల ఉప సంహరణ.. అనంతరం తుది జాబితా ప్రకటిస్తారు.
డిసెంబర్ 2న పోలింగ్.. అదే రోజు ఫలితాలు
డిసెంబర్ 2న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.


