● రెండు నెలల ముందే ఫుల్ అయిన రైళ్లు
● జనవరి 11–13 తేదీల్లో ‘వెయిటింగ్’ టికెట్లు కూడా లేవు
రాజంపేట : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు రైలు ప్రయాణం ఇప్పటి నుంచే భారంగా మారింది. పండుగకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ ప్రధాన రైళ్లలో రిజర్వేషన్లు నిండిపోయాయి. ముఖ్యంగా జనవరి 11, 12, 13 తేదీలలో తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రైళ్లన్నీ ’రిగ్రెట్’ చూపిస్తున్నాయి. వెయిటింగ్ లిస్టులోనూ టికెట్ బుక్ చేసుకునే అవకాశం లేకుండాపోయింది.
నిమిషాల్లోనే నిండిపోయిన బోగీలు
రైళ్లలో గరిష్టంగా 60 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది. బుకింగ్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సంక్రాంతికి మూడు రోజుల ముందు నుంచే ప్రయాణాలకు సిద్ధమవుతుండటంతో జనవరి 11 నుంచి రద్దీ భారీగా పెరిగింది. సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లతో పాటు కాచిగూడ, మహబూబ్‌నగర్ మీదుగా తిరుపతి మార్గంలో నడిచే రైళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ఏసీల్లోనూ భారీ రద్దీ..
సాధారణంగా స్లీపర్ క్లాస్ టికెట్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కానీ ఈసారి ఏసీ బోగీల్లోనూ రిజర్వేషన్లు వేగంగా పూర్తయ్యాయి. పలు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ పరిమితి దాటేసి ’రిగ్రెట్’ చూపిస్తోంది.జిల్లా మీదుగా హైదరాబాద్ నుంచి నడిచే వెంకటాద్రి, రాయలసీమ, ఏపీ సంపర్క్ క్రాంతితో పాటు తెలంగాణ మీదుగా వచ్చే వారాంతపు రైళ్లలోనూ భారీ డిమాండ్ నెలకొంది. దీంతో నిల్చుని అయినా వెళదామని, కుటుంబంలో ఒకరికి సీటు దొరికినా సర్దుబాటు చేసుకుందామనుకునే వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. అయితే, జిల్లా మీదుగా కాకుండా నల్గొండ, గుంటూరు మీదుగా రాకపోకలు సాగించే హైదరాబాద్–తిరుపతి వందేభారత్ రైలులో మాత్రం జనవరి 9–13 తేదీల వరకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
తుంగభద్రను నందలూరు వరకు పొడిగించాలి
కడప–కర్నూలు మధ్య రాకపోకలు అధికంగా ఉన్నందున కాచిగూడ నుంచి నడిచే తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ (17023) రైలును నందలూరు వరకు పొడిగించాలనే ప్రతిపాదన చిరకాలంగా ఉంది. డే–ట్రైన్‌గా ఉన్న ఈ రైలును పొడిగిస్తే ఉమ్మడి కడప జిల్లా వాసులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.
● నాంపల్లి/కాచిగూడ నుంచి సాయంత్రం బయలుదేరి రాత్రి 9 గంటలకు కర్నూలు చేరుకునే హంద్రీ (17027) ఎక్స్‌ప్రెస్ రైలును కడప వరకు పొడిగిస్తే తెలంగాణకు రెండు రైళ్ల సదుపాయం కలుగుతుందని రైల్వే నిపుణులు అంటున్నారు. అలాగే తెలంగాణ ప్రాంతం నుంచి ఉమ్మడి కడప జిల్లా మార్గంలో ప్రత్యేక రైళ్లు నడిపితే తాడిపత్రి, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, నందలూరు, రాజంపేట, రైల్వేకోడూరు (తిరుపతి జిల్లా) వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.


