● ఖాకీ అండతో కుట్రల పర్వం!
● సర్పంచ్ ఎన్నికల్లోనూ
పాత మాస్టర్ మైండ్.. ఒక్కటైన
క్రిమినల్ బ్రెయిన్, పోలీసు పవర్
● వేంపల్లెలో 2007 నాటి బొలెరో దగ్ధం.. 11 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై హత్యాయత్నం కేసు
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో అధికార పక్షం ‘అరాచకం–3’కి తెరలేపింది. గతంలో మున్సిపల్, ప్రాదేశిక (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల నామినేషన్ల వేళ సాగిన దౌర్జన్యాలు, ప్రత్యక్ష దాడులు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లోనూ పునరావృతమవుతున్నాయి. అధికార పక్షం మాస్టర్ మైండ్‌కు పోలీసు పవర్ జతకట్టడంతో జిల్లాలో కుట్రలు, కుయుక్తులు పరాకాష్టకు చేరాయి. ముఖ్యంగా పులివెందుల సబ్ డివిజన్‌లో అధికార పక్షం క్రిమినల్ ఆలోచనలకు పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో తోడ్పాటు అందిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.
ఆటగాడూ.. అంపైర్ ఒక్కటైతే ఇంతే!
ఏకపక్ష యంత్రాంగం, క్రిమినల్ మైండ్ ఒక్కటైతే సమాజంలో పరిస్థితులు ఎలా ఉంటాయో,అచ్చం పులివెందుల నియోజకవర్గంలో ప్రస్తుతం అలాగే కనిపిస్తోంది. ప్రశాంతంగా జరగాల్సిన పార్టీ రహిత సర్పంచ్ ఎన్నికల్లోనూ ఆటగాడూ, అంపైర్ ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఉన్నతాధికారులు, అధికార పక్షం ఆదేశాలకు తలొగ్గా రని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘సర్వర్ డౌన్’ నాటకాలు: నామినేషన్ల దాఖలుకు కీలకమైన నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీలు) జారీ చేయకుండా, ‘సర్వర్ డౌన్’ అనే సాకుతో అధికారులు బ్రేకు లు వేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు నామినేషన్లు వేయలేక ముప్పుతిప్పలు పడుతున్నారు.
జమ్మలమడుగు నుంచి ఔట్‌సోర్సింగ్ రౌడీలు: ఒక దశ లో అడ్డగింతలు, మలిదశలో జమ్మలమడుగు ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్న ‘ ఔట్‌సోర్సింగ్ రౌడీలతో’ దౌర్జన్యం చేయించడం, వారికి ఖాకీలు అండగా సాధారణమైందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
వేంపల్లెలో పాత బొలెరో దగ్ధం..
11 మందిపై హత్యాయత్నం కేసు!
ప్రత్యర్థులను ఎన్నికల బరిలో లేకుండా చేసేందుకు అక్రమ కేసులనే ఆయుధాలుగా వాడుకుంటున్నారు. వేంపల్లె కేంద్రంగా 2007 నాటి పాత బొలెరో వాహ నం దగ్ధం కావడం కలకలం రేపుతోంది. ఇడుపులపాయ టీడీపీ నేత చండ్రాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరితో పాటు మరో 10 మంది కట్టెలు, రాడ్లు పట్టుకుని వచ్చారని, తాను పారిపోవడంతో వాహనానికి నిప్పు పెట్టారని పేర్కొనడంతో పోలీసులు ఏకంగా 11 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశా రు. వీరన్నగట్టుపల్లె, ఇడుపులపాయ గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని, ఎఫ్‌ఐఆర్‌లోని ‘అదర్స్’ జాబితాను అడ్డం పెట్టుకుని వేధించేందుకే ఈ పాత వాహనం దగ్ధం కథనాన్ని తెరపైకి తెచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
900 మందిపై కేసులు!
పోలీసుల ఏకపక్ష చర్యలు ఏ స్థాయికి చేరాయంటే, ఇటీవల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ పులివెందుల పోలీసులు ఏకంగా ఏకే–47 ( అఓ–47) తుపాకీతో కాల్పులు జరిపారు. సాధారణంగా తీవ్రవాదు లు, దేశద్రోహులను కట్టడి చేయడానికి మాత్రమే వాడే ఏకే–47 గన్‌ను, నామినేషన్లు వేయడానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకునేందుకు ప్రయోగించడం విమర్శలకు దారితీసింది.నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ శ్రేణులు మారణాయుధాలతో మోహరించాయని, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేతృత్వంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీసులు రాళ్ల దాడులు, టియర్ గ్యాస్ ప్రయోగంతో పాటు కాల్పులు జరపడంతో ముగ్గురికి గాయాలయ్యాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. తిరిగి బాధితులపైనే ఉక్కుపాదం మోపుతూ పోలీసు ఇన్‌స్పెక్టర్ల ఫిర్యాదు మేరకు రెండు కేసుల్లో ఏకంగా 900 మందికి పైగా వైఎస్సార్‌సీపీ శ్రేణులను నిందితులుగా చేర్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా కీలక నాయకులందరినీ అక్రమ కేసులతో అరెస్టు చేసేందుకు శ్రీకారం చుట్టారు. మూడు దశాబ్దాలుగా ఎప్పుడూ చూడని ఇలాంటి విష సంస్కృతిని, ‘స్పాన్సర్డ్ క్రైమ్’ రాజకీయాలను ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూడాల్సి వస్తోందని, ఉన్నతాధికారుల మౌనం వల్లే ఈ పరిస్థిత ని రాజకీ య విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీఎంఓ నుంచి...
పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో బుధవారం నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. పులివెందుల పరిధిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లు అడ్డుకోవాలంటూ సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కర్నూల్‌రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ డీఎస్పీ, సీఐలతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ముందే పులివెందుల డీఎస్పీతో బీటెక్ రవి మంతనాలు సాగించినట్లు సమాచారం.


