సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్) : రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల అండర్–19 హ్యాండ్‌బాల్ పోటీల్లో వైఎస్సార్ కడప జిల్లా బాలుర జట్టు రన్నరప్‌గా నిలిచింది. టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న కడప జట్టు, తుది పోరులో కృష్ణా జిల్లా చేతిలో పోరాడి ఓడింది.
స్కూల్ గేమ్స్ ఫెడరేష (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో విజయవాడలోని కేబీఎన్ కళాశాల వేదికగా ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ఈ పోటీలు జరిగాయి. ఉమ్మడి 13 జిల్లాల నుంచి బాలురు, బాలికల విభాగాల్లో 210 మంది చొప్పున మొత్తం 420 మంది క్రీడాకారులు ఈ టోర్నీలో తలపడ్డారు.
ఫైనల్‌లో పోరాడి ఓడిన కడప
లీగ్, నాకౌట్ దశల్లో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లిన వైఎస్సార్ కడప బాలుర జట్టు, తుది సమరంలో కృష్ణా జిల్లా జట్టుతో తలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కడప క్రీడాకారులు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, చివరకు 9–16 గోల్స్ తేడాతో ఓటమి పాలై రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నారు. మరోవైపు బాలికల విభాగంలోనూ కృష్ణా జిల్లా జట్టే (ఫైనల్‌లో శ్రీకాకుళంపై 24–7 తేడాతో) విజేతగా నిలిచింది. కేబీఎన్ కళాశాల వ్యాయామ విద్య విభాగాధిపతి డి. హేమచంద్రరావు పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల ముగింపు వేడుకల్లో కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్ డాక్టర్ టి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు, రన్నరప్ జట్లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కేపీవీవీ హిందూ విద్యాసంస్థల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి. నారాయణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి. కృష్ణవేణి, అబ్జర్వర్ కె. అలివేలుమంగమ్మ, పి. విజయ్‌కుమార్ పాల్గొన్నారు.


