కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) 2026–27 సీజన్‌కు సంబంధించి నిర్వహిస్తున్న అండర్–15 మహిళల రాష్ట్ర ప్రాబబుల్స్ వన్డే మ్యాచ్‌లు ఉత్సాహంగా సాగుతున్నాయి. సోమవారం కడపలోని రెండు మైదానాల్లో జరిగిన పోటీల్లో టీమ్–ఎ, టీమ్–డి జట్లు విజయఢంకా మోగించాయి.
టీమ్–ఎ విజయం
స్థానిక కెఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టీమ్–ఎ 119 పరుగుల భారీ తేడాతో టీమ్–సిపై గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్–ఎ నిర్ణీత 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ విశ్వశ్రీ (90 బంతుల్లో 131; 22 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి శతకం బాదగా, అక్షయ (73) అర్ధశతకంతో ఆకట్టుకుంది. టీమ్–సి బౌలర్ శేష 2 వికెట్లు తీసింది. అనంతరం 278 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్–సి 29.1 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది. హర్షిత గౌడ (97) తృటిలో శతకం చేజార్చుకుంది. టీమ్–ఎ బౌలర్లలో లక్ష్మీ లోహిత, ఫేక్ దిషాద్ తలో 3 వికెట్లు పడగొట్టారు.
రక్షిత మెరుపులు.. టీమ్–డి గెలుపు
కెఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో టీమ్–డి 52 పరుగుల తేడాతో టీమ్–బిపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్–డి 35 ఓవర్లలో 7 వికెట్లకు 207 పరుగులు చేసింది. రక్షిత (90) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, దీక్షమహి (33) రాణించింది. టీమ్–బి బౌలర్లు కార్తీక 3, గాయత్రి 2 వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనకు దిగిన టీమ్–బి 35 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. కార్తీక (50) అర్ధశతకంతో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచినా, జాహ్నవి యాదవ్ (33) సహకరించినా ఓటమి తప్పలేదు. టీమ్–డి బౌలర్ లక్ష్యమోహన్ 2 వికెట్లు దక్కించుకుంది.


