విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు ‘పాల్‌’ల్యాబ్‌లు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు ‘పాల్‌’ల్యాబ్‌లు

Nov 17 2026 12:32 AM | Updated on Nov 17 2026 12:32 AM

కడప ఎడ్యుకేషన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరిచి, వారు తమ సొంత వేగంతో నేర్చుకునేలా చేసేందుకు ‘పర్సనల్‌ అడాప్టివ్‌ లెర్నింగ్‌’(పీఏఎల్‌) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు సమగ్రశిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు అధికారి అనురాధ తెలిపారు. సోమవారం కడప సమగ్రశిక్ష కార్యాలయంలో జిల్లాలోని 16 పాఠశాలలకు ఒక్కో బడికి సుమారు రూ.12 లక్షల విలువైన పీఏఎల్‌ ల్యాబ్‌ పరికరాలను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలకు 30 ట్యాబ్‌లు, 30 బ్యాక్‌ పౌచ్‌లు, 30 అడాప్టర్లు, 30 ఓటీజీ కేబుళ్లను అందించామన్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు గణితం, తెలుగు, ఆంగ్ల సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారి స్థాయికి తగిన డిజిటల్‌ పాఠ్యాంశాల ద్వారా ప్రత్యేక అభ్యసన అవకాశాలు కల్పిస్తామని వివరించారు. పాఠశాలల్లో 30 ట్యాబ్‌లను ఒకేసారి వినియోగించుకునేలా టేబుళ్లు, కుర్చీలతో ప్రత్యేక ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.జిల్లాలో ఇప్పటికే 54 పాఠశాలల్లో పీఏఎల్‌ కార్యక్రమం కొనసాగుతుండగా, తాజాగా మరో 16 పాఠశాలలు చేరడంతో మొత్తం 70 పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలులోకి రానుందన్నారు. ఇందులో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలలతో పాటు కేజీబీవీలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. రోజువారీ తరగతుల్లో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు స్వయంగా నేర్చుకునేలా ఈ విధానాన్ని రూపొందించామన్నారు. ల్యాబ్‌ల పనితీరు, విద్యార్థుల పురోగతిని ఫీల్డ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఎంఎస్‌) ఇన్‌స్ట్రక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థుల్లో అభ్యసన అంతరాలను తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ బి. మహేశ్వరరెడ్డి, సూపరింటెండెంట్‌ బాదుల్లా, ఎఫ్‌ఎంఎస్‌ ఇన్‌స్ట్రక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement