● పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నాయకులు
కడప కార్పొరేషన్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఫోటోను మార్ఫింగ్ ద్వారా టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి ఫొటోను ఏర్పాటు చేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మిశెట్టి చంద్రశేఖర్ ను వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం వనన్టౌన్ పోలీస్ స్టేషన్న్లో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కోట్లాది మంది భక్తులు ఆరాధించే కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారి ఫొటోను మార్ఫింగ్ చేయడం అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. గతంలో స్వామివారి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని సైతం వివాదాల్లోకి లాగారని, ఇప్పుడు ఏకంగా స్వామివారి ఫోటోనే మార్ఫింగ్ చేయడం ద్వారా భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడి చిత్రాలను ఉపయోగించుకోవడం మానుకోవాలని హితవు పలికారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి, ఫొటోను మార్ఫింగ్ చేసిన బొమ్మిశెట్టి చంద్రపై చట్టప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట కృష్ణ, మాజీ కార్పొరేటర్లు బసవరాజు, శ్రీరంజన్ రెడ్డి, రెడ్డి ప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు టీపీ.వెంకటసుబ్బమ్మ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గురు సాయి దత్త, మహిళ రాష్ట్ర కార్యదర్శులు ఉమామహేశ్వరి రత్నకుమారి, తులసమ్మ, నారాయణమ్మ, శివమ్మ, నాయకులు రామచంద్రయ్య,మల్లికార్జున రెడ్డి, రమేష్, నిశాంత్ పాల్గొన్నారు.


