అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం

Nov 16 2026 1:20 AM | Updated on Nov 16 2026 1:20 AM

అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం

చింతకొమ్మదిన్నె: సాగులో వరుస నష్టాలు, తడిసి మోపైడెన అప్పుల భారం ఓ రైతును ఆత్మహత్యాయత్నానికి పురిగొల్పింది. చింతకొమ్మదిన్నె మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గూడా ఉమాపతిరెడ్డి తనకున్న 1.80 ఎకరాల సొంత భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని పసుపు, అరటి, తమలపాకులు, చామంతి వంటి వాణిజ్య, ఉద్యాన పంటలను సాగు చేస్తున్నాడు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో రాలేదు. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాలేదు. సాగు కోసం చేసిన అప్పులు పేరుకుపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉమాపతిరెడ్డి, ఆదివారం సాయంత్రం పొలం కోసం తెచ్చిన కలుపు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆయనను కడప నగరంలోని పల్స్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో నాగిరెడ్డిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకుని ఆర్థిక భరోసా కల్పించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

రైతుకు రవీంద్రనాథరెడ్డి పరామర్శ

విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి ఆదివారం కడపలోని పల్స్‌ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న ఉమాపతిరెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం రైతు కుమారులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement