గుర్రంకొండ: ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీ) ఎన్నికల్లో పలు ఆసక్తికరమైన వింతలు, చిత్రాలు చోటుచేసుకుంటున్నా యి. చూడటానికి ఒకే గ్రామంగా కనిపించే పల్లెలు.. పాలనాపరంగా వేర్వేరు పంచాయతీలు, వేర్వేరు మండలాలు, చివరికి వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి రావడం విశేషం. గుర్రంకొండ మండలంలోని మూడు గ్రామాలు సరిగ్గా ఇలాంటి కోవలోకే వస్తుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది.
1. రెండు నియోజకవర్గాల పరిధిలో
‘చింతమాకులపల్లె’
చింతమాకులపల్లె గ్రామంలోని కొంత భాగం పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలం ఎల్లుట్ల పంచాయతీ పరిధిలోకి రాగా, మిగిలిన భాగం తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలం సిద్ధవరం పంచాయతీ పరిధిలోకి వస్తుంది. గ్రామంలో 60 కుటుంబాలు నివసిస్తుండగా, 160 ఓట్లు ఉన్నాయి. ఇందులో 8 కుటుంబాలకు చెందిన 22 ఓట్లు ఎల్లుట్ల పంచాయతీ పరిధిలోకి.. మిగిలిన 52 కుటుంబాలకు చెందిన 138 ఓట్లు సిద్ధవరం పంచాయతీ పరిధిలోకి వెళ్తాయి.
2. ఒకే గ్రామం..
రెండు మండలాలు ‘మొటుకు’ విచిత్రం
నడిమిఖండ్రిగ పంచాయతీ పరిధిలో మొటుకు గ్రామం ఉంది. ఈ గ్రామం మధ్యలో ఒక చెరువు వంక ఉండటంతో ఊరు రెండుగా విడిపోయినట్లు కనిపిస్తుంది. చూసేవారికి మాత్రం అంతా ఒకే ఊరిలా కనిపించినప్పటికీ, వంకకు పడమర వైపు ఉన్న భాగాన్ని ‘మొటుకు’ అని, తూర్పు వైపు ఉన్న భాగాన్ని ‘చిన్న మొటుకు’ అని పిలుస్తారు. మొటుకు గ్రామంలో 100 కుటుంబాలు నివసిస్తుండగా, వీరు గుర్రంకొండ మండలం నడిమిఖండ్రిగ పంచాయతీ పరిధిలోకి వస్తారు. చిన్న మొటుకు లో 40 కుటుంబాలు ఉండగా, వీరు కలకడ మండలం నడిమిచెర్ల పంచాయతీ పరిధిలోకి వస్తారు.
3. ఒకే గ్రామం.. వేర్వేరు పంచాయతీలు
మండల కేంద్రమైన గుర్రంకొండ పట్టణానికి ఫర్లాంగు దూరంలో మగ్బీరా గ్రామం ఉంది. పూర్వకాలం నుంచి ఇది గుర్రంకొండ కోటను పరిపాలించిన నవాబుల పూర్వీకుల గ్రామంగా పేరుగాంచింది. ఎన్‌హెచ్–340 జాతీయ రహదా రిపై ఉన్న ఈ గ్రామంలోని ఓటర్లు రెండు పంచాయతీల పరిధిలో ఉన్నారు. జాతీయ రహదారికి తూర్పు వైపు ఉన్న ఇళ్లతో పాటు పడమర వైపు ఉన్నవాటిలో సగం ఇళ్లు గుర్రంకొండ మేజర్ పంచాయతీ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. పడమర వైపు ఉన్న మిగిలిన సగం ఇళ్లు ఖండ్రిగ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ 45 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
ఇలా ఒకే ఊరిలో పక్కపక్కనే నివాసం ఉంటూ, వేర్వేరు పంచాయతీలు, మండలాలు, నియోజకవర్గాల పరిధిలో ఓట్లు వేస్తుండటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆసక్తికరంగా మారింది.


