అస్తవ్యస్తంగా ఓటరు జాబితాలు
రాజంపేట: ‘సారూ.. మా వీధిలో డ్రైనేజీ సక్రమంగా లేదు, తాగునీరు అందట్లేదు. మాకు సదుపాయాలు కల్పిస్తే వార్డు సభ్యుడిగా మీకే మా ఓటు’ అని చెబుతున్న ఓటర్లకు అభ్యర్థులు ఇస్తున్న సమాధానం మింగుడుపడటం లేదు. ‘మీ ఓటు అసలు ఈ వార్డులోనే లేదు’ అంటూ జాబితాను చూపిస్తుండటంతో ఓటర్లు కంగుతింటున్నారు. జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలలో ఓటరు జాబితాలు అస్తవ్యస్తంగా మారడంతో, ఏ వార్డులో ఎవరి ఓటు ఉందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
తప్పుల తడకగా జాబితాలు..
జిల్లాలో తొలి విడత కింద రాజంపేట, బద్వేలు డివిజన్లలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఓటరు జాబితాలు తప్పుల తడకగా దర్శనమిస్తున్నాయి. ఒక వార్డులో నివాసం ఉంటున్న వ్యక్తి ఓటు మరో వార్డులోకి మారిపోయింది. దీంతో తమ వార్డులో పోటీ చేసే అభ్యర్థిని సమస్యలపై నిలదీసే హక్కు కూడా లేకుండా పోయిందని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలోని ఎక్కడి నుంచైనా పోటీ చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ, తాము నివాసం ఉండే సొంత వార్డులో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతున్నామని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు.
ఇష్టానుసారంగా వార్డుల విభజన
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాను పరిశీలించుకుంటే ఓటర్లు అవాక్కవుతున్నారు. ఇష్టానుసారంగా వార్డులను విభజించడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లోనూ ఇదే సమస్య నెలకొంది.
జాబితాలో మృతుల పేర్లు...
పంచాయతీల ఓటరు జాబితాలో మృతుల పేర్లు అధికంగా కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం మృతి చెందిన వారి పేర్లు కూడా జాబితాలో ఉండటం అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. జాబితాలను సక్రమంగా రూపొందించకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తింది. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి, తగిన చర్యలు తీసుకుని ఓటరు జాబితాలను సరిచేయాలని ఓటర్లు కోరుతున్నారు.


