కమలాపురం : చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే పాఠశాల లక్ష్యం అని డీఏవీ–భారతి విద్యా మందిర్ ప్రిన్సిపల్ శివ్వం కిషోర్ కుమార్ తెలిపారు. శనివారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని నల్లలింగాయపల్లెలో వెలసిన డీఏవీ భారతి విద్యా మందిర్‌లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్లాంట్ ప్రతినిధుల సతీమణులు భువనేశ్వరి, స్వాతి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారి ఆధ్వర్యంలో నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నేటి బాలలే రేపటి పౌరులని, భవిష్యత్తు అంతా బాలలదేనని వారన్నారు. వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుముతులు పద్రానం చేశారు. ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు పాఠశాలలో అనేక రకాల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జ్ఞానం–సేవా దృక్పథం కలిగిన పౌరులను తీర్చిదిద్దడమే తమ విద్యాలయ ధ్యేయమన్నారు. పాఠశాల విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో సాధిస్తున్న విజయాలను వివరించారు. అనంతరం చిన్నారులకు ఫ్యాషన్ షో, హైస్కూల్ విద్యార్థులకు ఇంటర్ హౌస్ డ్యాన్స్ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు.


