కమలాపురం : పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియాలో శ్రీ హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి బర్సీ మహోత్సవాన్ని శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. దర్గా పీఠాధిపతి, సజ్జాదే నషీన్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో అశేష భక్తజన సందోహం నడుమ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా పాత బస్టాండ్ సమీపంలోని గంధం ఇంటి నుండి, ప్రత్యేకంగా అలంకరించిన చాందినిలో గంధాన్ని ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చారు. బాణసంచా కాల్పులు, డప్పు వాయిద్యాల నడుమ సాగిన ఈ ఊరేగింపులో యువకులు వివిధ రకాల నృత్యాలతో సందడి చేశారు. ఊరేగింపు దర్గాకు చేరుకున్న అనంతరం పీఠాధిపతి ఆధ్వర్యంలో భక్తులు స్వామి వారి మజార్లపై పూల చాదర్ సమర్పించి, గంధం ఎక్కించారు. అనంతరం ప్రత్యేక ఫాతెహా నిర్వహించి, పీఠాధిపతి భక్తులందరికీ గంధాన్ని పంపిణీ చేశారు. వేడుకలకు విచ్చేసిన భక్తుల కోసం నిర్వాహకులు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు దస్తగిరి స్వామి, మౌలానా స్వామి, గౌస్‌పాక్, జియా, ఇస్మాయిల్, సర్ఫరాజ్ స్వాములతో పాటు మత పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.


