కడప సెవెన్‌రోడ్స్ : ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ‘పబ్లిక్ పాలసీలో అడ్వాన్స్ మేనేజ్‌మెంట్ ప్రోగామ్’లో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీని అందుకున్నారు. శనివారం మొహాలీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంపస్‌లో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ డిగ్రీని అందుకున్నారు. భారత ప్రభుత్వ నామినేషన్‌పై ఒక సంవత్సర వ్యవధిగల కోర్సును అభ్యసించారు. దీని ద్వారా ప్రజా విధానాల రూపకల్పన, సమర్థవంతమైన అమలు, పాలనలో నూతన విధానాలు, సంస్థాగల పర్యవేక్షణ అమలు, అనంతర సమీక్ష వంటి అంశాలపై లోతైన అవగాహన పొందే అవకాశం కలిగింది. ఈ కోర్సులో భాగంగా ‘ప్రజా సేవల మెరుగైన అందుబాటులో బిగ్ డేటా, కృత్రిమ మేధస్సు వినియోగం’ అనే అంశంపై ఆయన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ప్రజలకు అందించే ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, జవాబుదారి తనంతో ప్రజా అవసరాలకు అనుగుణంగా ఎలా మెరుగుపరచవచ్చో ఈ పరిశోధనలో ఆయన విశ్లేషించారు.


