గ్రంథా(లయా)లకు నిర్లక్ష్యపు చెదలు | - | Sakshi
Sakshi News home page

గ్రంథా(లయా)లకు నిర్లక్ష్యపు చెదలు

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

కడప సెవెన్‌రోడ్స్‌: ఒకప్పుడు విజ్ఞాన భాండాగారాలుగా ఒక వెలుగు వెలిగిన ప్రభుత్వ గ్రంథాలయాలు, నేడు పాలకుల నిర్లక్ష్యంతో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పేరిట హంగామా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, క్షేత్రస్థాయిలో గ్రంథాలయాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బకాయిల విడుదల, సిబ్బంది భర్తీ, అసంపూర్తి భవనాల పూర్తి వంటి కీలక అంశాలను గాలికొదిలేసి ఉత్సవాలు నిర్వహిస్తే ఏం ప్రయోజనమని పాఠకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

నిలిచిపోయిన రూ. 4 కోట్ల బకాయిలు..

జిల్లా గ్రంథాలయ సంస్థకు ఏకై క ఆర్థిక వనరు శ్రీగ్రంథాలయ సెస్సు మాత్రమే. అన్ని పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల ద్వారా వసూలయ్యే ఇంటి పన్ను నుంచి 0.8 శాతం గ్రంథాలయాల అభివృద్ధికి కేటాయించాలి. కానీ ఏటా సెస్సు వసూలు కాకపోవడంతో లైబ్రరీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి రూ. కోటి, గ్రామ పంచాయతీల నుంచి రూ. 3 కోట్లు కలిపి మొత్తం రూ. 4 కోట్ల మేర సెస్సు బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయంపై దృష్టి సారించకపోవడంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

అసెంబ్లీలో హామీ ఇచ్చినా.. కదలని భవన నిర్మాణం!

కడప నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవన నిర్మాణాన్ని రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో గతంలో చేపట్టారు. సుమారు రూ. కోటి వరకు ఖర్చు చేసిన తర్వాత, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఈ విషయాన్ని గత శాసనసభ సమావేశాల్లో కడప ఎమ్మెల్యే ప్రస్తావించగా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ బదులిస్తూ నిధులు విడుదల చేసి 9 నెలల్లో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. అయితే, ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సగం పోస్టులు ఖాళీ.. 20

ఏళ్లుగా నియామకాలు నిల్‌!

జిల్లా వ్యాప్తంగా మొత్తం 62 గ్రంథాలయాలున్నాయి. వీటిలో మొత్తం 113 శాంక్షన్‌ పోస్టులు ఉండగా, ప్రస్తుతం కేవలం 57 మంది మాత్రమే (37 మంది రెగ్యులర్‌, 20 మంది ఔట్‌సోర్సింగ్‌) పనిచేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా రెగ్యులర్‌ నియామకాలు జరగకపోవడంతో ఒక్కో లైబ్రేరియన్‌ను రెండు, మూడు గ్రంథాలయాలకు ఇన్‌ఛార్జిగా నియమించారు. ఉద్యోగ విరమణ చేసిన వారిని కూడా తిరిగి నియమించుకునే దుస్థితి నెలకొంది.

జీతాలు, పెన్షన్లు అందక ఉద్యోగుల అవస్థలు..

ఒకవైపు అదనపు పనిభారం మోస్తున్న ఉద్యోగులకు, సకాలంలో వేతనాలు అందకపోవడం మరో శాపంగా మారింది. రెగ్యులర్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఈ నెల జీతాలు ఇంతవరకు రాలేదు. వేతనాలు అందక కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు భారంగా మారాయని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు, రిటైర్డ్‌ ఉద్యోగులకు గత రెండు నెలలుగా పెన్షన్‌ విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నిరుద్యోగులకు తప్పని ఇబ్బందులు..

డీఎస్సీ, ఏపీపీఎస్‌సీ, పోలీసు, ఆర్‌ఆర్‌బీ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది పేద, మధ్యతరగతి అభ్యర్థులకు గ్రంథాలయాలే ప్రధాన దిక్కు. సెస్సు బకాయిలు విడుదల కాకపోవడంతో పోటీ పరీక్షలకు అవసరమైన కొత్త పుస్తకాలు కొనుగోలు చేయలేకపోతున్నామని సిబ్బంది వాపోతున్నారు. భవనాలకు మరమ్మతులు లేక వర్షం వస్తే ఉన్న విలువైన పుస్తకాలు తడిసి పాడైపోతున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు వంటి కనీస సౌకర్యాలు, సరైన దినపత్రికలు కూడా లేక పాఠకులు అవస్థలు పడుతున్నారు.

సమస్యల మధ్య వారోత్సవాలు..

సొంత డబ్బులతో సతమతం

నేటి (శనివారం) నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడినప్పటికీ, అవసరమైన బడ్జెట్‌ మరియు ముందస్తు నిధుల మంజూరుపై స్పష్టత లేకపోవడం ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది.

పెండింగ్‌ బిల్లులు: 2025లో నిర్వహించిన సమ్మర్‌ క్యాంపులకు సంబంధించిన నిధులు ఇప్పటికీ విడుదల కాలేదని, ఉద్యోగులు తమ సొంత డబ్బులు ఖర్చు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన ఖర్చులు: ప్రస్తుతం స్టేషనరీ, ముద్రణ, బ్యానర్లు, బహుమతులు, అల్పాహారం ఖర్చులు గణనీయంగా పెరిగాయని, గతంలో కేటాయించిన నిధులు ప్రస్తుత మార్కెట్‌ ధరలకు ఏమాత్రం సరిపోవడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలకు స్పష్టమైన పరిపాలన, ఆర్థిక అనుమతులతో పాటు నిధుల మంజూరు ఉత్తర్వులు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం వారోత్సవాలను మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకోకుండా, గ్రంథాలయాల్లో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు, పాఠకులు కోరుతున్నారు.

పేరుకుపోయిన రూ. 4 కోట్ల సెస్‌ బకాయిలు.. అందని నిధులు

113 పోస్టులకు.. విధుల్లో ఉన్నది 57 మందే

20 ఏళ్లుగా నియామకాలు నిల్‌.. జీతాలు, పెన్షన్లు రాక ఉద్యోగుల అగచాట్లు

అసెంబ్లీలో మంత్రి హామీ ఇచ్చినా..

కదలని కడప కేంద్ర గ్రంథాలయ భవనం

బడ్జెట్‌ లేకుండానే నేటి నుంచి 59వ

జాతీయ గ్రంథాలయ వారోత్సవాల నిర్వహణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement