వేంపల్లె : విద్యార్థుల్లో పారిశ్రామిక ఆలోచనా విధానాన్ని పెంపొందించి, వారిని ఉద్యోగార్థుల నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీర్చిదిద్దే లక్ష్యంతో ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి టెక్నోప్రెన్యూర్‌షిప్ కార్యక్రమం విజయవంతమైందని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ విజయప్రకాశ్ పేర్కొన్నారు. ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌లోని మేనేజ్‌మెంట్ విభాగం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ (ఈ–సెల్) సంయుక్త ఆధ్వర్యంలో క్యాంపస్ డైరెక్టర్ మార్గదర్శకత్వంలో మేనేజ్‌మెంట్ విభాగం, ఈ–సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ కాంపా కిషోర్ కుమార్ సమన్వయంతో ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో విద్యార్థులు 90 వినూత్న స్టార్టప్, వ్యాపార ఆలోచనలను ప్రదర్శించారు. కృత్రిమ మేధస్సు(ఏఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ హిత వ్యాపార విధానాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. వ్యాపార అవకాశాలను గుర్తించడం, వినియోగదారుల అవసరాలను విశ్లేషించడం, నమూనాల రూపకల్పన, వ్యాపార సాధ్యాసాధ్యాలను అంచనా వేయడం వంటి అంశాలపై నిపుణులు వివరించారు. ఎస్‌హెచ్‌ఏపి, ఎల్‌ఐఎంఈ వంటి ఏఐ విశ్లేషణ సాధనాల ద్వారా బాధ్యతాయుతమైన సాంకేతిక వినియోగం, నైతిక విలువల ప్రాధాన్యతను తెలియజేశారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను 35 మార్కుల ప్రామాణిక మూల్యాంకన విధానంలో నిపుణుల బృందాలు పరిశీలించాయి. ఆవిష్కరణ, సాంకేతిక వినియోగం, మార్కెట్ అవకాశాలు, వ్యాపార సాధ్యాసాధ్యాలు, సామాజిక ప్రభావం, సుస్థిర అభివృద్ధి తదితర 15 అంశాల ఆధారంగా మూల్యాంకనం చేపట్టారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రొఫెసర్ జి.విజయ ప్రకాష్, పరిపాలనా అధికారి డాక్టర్ సి.హెచ్.రత్నకుమారి కార్యక్రమ నిర్వహణను అభినందించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా డాక్టర్ కాంపా కిషోర్ కుమార్ వ్యవహరించారు.


