ఉల్లి కోయకుండానే కన్నీళ్లు.. వెల్లుల్లి వెల వింటేనే ఎక్కిళ్లు ! | - | Sakshi
Sakshi News home page

ఉల్లి కోయకుండానే కన్నీళ్లు.. వెల్లుల్లి వెల వింటేనే ఎక్కిళ్లు !

Nov 13 2026 3:47 AM | Updated on Nov 13 2026 3:47 AM

●గత ప్రభుత్వంలో సబ్సిడీతో అండ.. గతంలో ఎన్నడూ ఇంత ధరలు లేవు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.. వెయ్యి రూపాయలు తీసుకెళ్లినా సంచి నిండటం లేదు..

● దడ పుట్టిస్తున్న నిత్యావసరాల ధర

● పేద, మధ్యతరగతి కుటుంబాలపై నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల అదనపు భారం

● సలసల కాగుతున్న వంట నూనెలు..

మండిపోతున్న బియ్యం, పప్పులు, మసాలాలు

● గతేడాదితో పోలిస్తే అన్ని నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు

● ధరల నియంత్రణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం

కడప అగ్రికల్చర్‌: ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు పేద, మధ్యతరగతి ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. ఒకప్పుడు రోజువారీ కూలీతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన సామాన్యుడికి ఇప్పుడు పూట గడవడమే కష్టంగా మారింది. గతేడాది (2025 నవంబర్‌)తో పోలిస్తే ఈ ఏడాది (2026 నవంబర్‌) ఉప్పు, పప్పుల నుంచి బియ్యం, వంట నూనెల వరకు అన్నింటి ధరలు రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్నాయి. ఉల్లి కోస్తే కన్నీళ్లు, వెల్లుల్లి తింటే ఎక్కిళ్లు వచ్చే పరిస్థితి నెలకొంది.

అర కిలో, పావు కిలోతోనే సర్దుబాటు..

నిత్యావసర సరుకులు, వంట నూనెల ధరల మధ్య సామాన్య, మధ్యతరగతి ప్రజలు నలిగిపోతున్నారు. ధరలు నెలనెలా పెరిగిపోతుండటంతో నలుగురు సభ్యులున్న ఒక సాధారణ కుటుంబంపై నెలకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు అదనపు ఆర్థిక భారం పడుతోంది. సంపాదించే ఆదాయంలో సింహభాగం ఇంటి సరుకులకే ఖర్చవుతుండటంతో, కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తోందని సామాన్యులు వాపోతున్నారు. గతంలో కిలో కొనుగోలు చేసే చోట ఇప్పుడు అర కిలో, పావు కిలోతోనే సర్దుకుపోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇలా ఎన్ని రోజులు కాలం వెళ్లదీయాలని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

బియ్యం, పప్పులు, నూనెలకు రెక్కలు:

గతంలో ఎన్నడూ లేని విధంగా బియ్యం ధరలు అమాంతం పెరిగాయి. గతేడాది కిలో రూ.60 ఉన్న పాత సోనామసూరి బియ్యం ఏకంగా రూ.85కు చేరగా, సాధారణ కొత్త బియ్యం రూ.17 నుంచి రూ.30కి ఎగబాకాయి. ఇక ఎండు మిర్చి కిలో రూ.160 నుంచి రూ.250కి, ధనియాలు రూ.120 నుంచి రూ.200కి, కందిబేడలు రూ.120 నుంచి రూ.150కి చేరాయి. మరోవైపు వంట నూనెలు సలసల కాగుతున్నాయి. వేరుశెనగ నూనె లీటర్‌ రూ.157 నుంచి రూ.185కు, పామాయిల్‌ రూ.110 నుంచి రూ.150కు పెరగడంతో సామాన్యుడి బడ్జెట్‌ తలకిందులైంది.

నిత్యావసర సరుకుల ధరలు ఇంత అధికంగా ఎప్పుడూ లేవు. ఏ వస్తువు ధర చూసినా వంద రూపాయలకు పైమాటే. ఈ ధరల్లో సామాన్యులు బతకడం చాలా కష్టం. ముఖ్యంగా కూలి నాలి చేసుకునే వారి బతుకు మరింత దుర్భరంగా మారింది. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ధరలను నియంత్రించాలి.

– రాజేశ్వరి, రామాంజనేయపురం, కడప

నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా సబ్సిడీపై సరుకులు అందించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అప్పుడే సామాన్యులు బతకగలరు. లేకపోతే వారి జీవనం మరింత దుర్భరంగా మారుతుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. – గాలి చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి

వెయ్యి రూపాయలు తీసుకుని మార్కెట్‌కు వెళితే చేతి సంచిలోకి కనీస సరుకులు కూడా రావడం లేదు. కిలో పామాయిల్‌, కిలో కందిపప్పు, కిలో బియ్యం, కిలో ఎండు మిర్చి, పప్పులు, కొబ్బరి కూడా కొనలేకపోతున్నాం. ధరలు ఇలా ఉంటే సామాన్యులు ఎలా బతుకుతారు? ధరల నియంత్రణపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలి. – నాగేశ్వరెడ్డి, రైతు, రావులపల్లె

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉల్లి సహా నిత్యావసరాల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. పంటలు ఎక్కువగా పండే ప్రాంతాల నుంచి మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోలు చేసి, రైతుబజార్లలో ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటు చేసి వినియోగదారులకు సబ్సిడీపై తక్కువ ధరకే విక్రయించింది. సబ్సిడీ పోను మిగతా భారాన్ని ప్రభుత్వమే భరించేది. కానీ, అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తామని ఊదరగొట్టిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం.. రెండున్నరేళ్లుగా సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ధరల నియంత్రణపై కనీస దృష్టి సారించకపోవడంతో పేద, మధ్యతరగతి జీవనం కడు భారంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement