●‘ఆ’ పాత్ర మేమే పోషిస్తామంటున్న ఖాకీలు.. సర్పంచ్‌ పీఠాలకు రేట్లు | - | Sakshi
Sakshi News home page

●‘ఆ’ పాత్ర మేమే పోషిస్తామంటున్న ఖాకీలు.. సర్పంచ్‌ పీఠాలకు రేట్లు

Nov 13 2026 3:47 AM | Updated on Nov 13 2026 3:47 AM

●‘ఆ’ పాత్ర మేమే పోషిస్తామంటున్న ఖాకీలు.. సర్పంచ్‌ పీఠాలకు రేట్లు

సాక్షి ప్రతినిధి, కడప: ‘ప్రజల కొరకు, ప్రజల చేత’ ఎన్నుకోవాల్సిన స్థానిక సంస్థల పీఠాలను ఇప్పుడు నోట్ల కట్టలు, కిరాయి రౌడీలు, అధికార యంత్రాంగం కలిసి ఏకపక్షంగా కబ్జా చేస్తున్నాయి. ప్రజాబలంతో గెలవలేమని చేతులెత్తేసిన అధికార పక్ష నేతలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఖూనీ చేస్తూ ‘కిరాయి గూండాగిరీ’కి తెరలేపారు. నాడు పాతతరంలో ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కోలేని ఫ్యాక్షనిస్టులు కిరాయి హంతకులు, రౌడీలను ఆశ్రయించేవారు. నేడు ప్రజల మెప్పు పొందలేమని గ్రహించిన రాజకీయ నేతలు, సరికొత్త ‘కిరాయి రౌడీమూకల’ను రంగంలోకి దించి స్థానిక సంస్థలను చెరబడుతున్నారు.

అక్రమాల విశ్వరూపం.. యంత్రాంగం ‘జీ హుజూర్‌’

ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు, ఎలా చేయాలో అన్నింటినీ అధికార పక్షం చేసి చూపించింది. కనీసం నామినేషన్లు కూడా వేయ నివ్వని నియంతృత్వ పోకడలు జిల్లాలో తెరపైకి వచ్చాయి. కూటమి మూకల అరాచకాలకు వ్యవస్థలన్నీ తలొగ్గి ‘జీ హుజూర్‌’ అనక తప్పలేదు. ఉన్నత చదువులు, హోదాలు సైతం పాలకుల అడుగులకు మడుగులొత్తుతూ సంస్కారహీనంగా మారిపోయాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కళ్లెదుటే నామినేషన్లు అడ్డుకుంటున్నా, పోలింగ్‌ ఏజెంట్లను బయటకు గెంటేస్తున్నా, ఓటర్లను కేంద్రాలకు రాకుండా నిలువరిస్తూ యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా.. ‘చెడు చూడం, చెడు వినం’ అన్నట్లుగా జిల్లా యంత్రాంగం కళ్లు మూసుకుందని జనం వాపోతున్నారు.

పాలిటిక్స్‌లోకి కిరాయి ముఠాలు.. కడప, బద్వేలులో భయోత్పాతం

జిల్లాలో గతంలో ‘కిరాయి హంతకులు’ అనే మాట వినిపించేది.. కానీ ఇప్పుడు ఏకంగా రాజకీయాల్లోకి ‘కిరాయి ముఠాలు’ వచ్చి చేరాయి. డబ్బులిస్తే ఎలాంటి అడ్డగోలు పనులు చేసేందుకైనా ఈ ముఠాలు వెనుకాడటం లేదు. నామినేషన్ల ఘట్టం మొదలు పోలింగ్‌ ముగిసే వరకు ‘పెట్టుడు మనుషుల’తో ప్రత్యర్థులను అడ్డగించడం, దాడులకు తెగబడటం, భయాందోళనలు సృష్టించడమే వీరి పనిగా మారింది. స్వేచ్ఛాయుతంగా పోలింగ్‌ జరిగితే తమ అడ్రస్‌ గల్లంతవుతుందనే భయమే అధికార పక్షాన్ని ఈ దారుణాలకు పురిగొల్పింది.

● కడప నగరంలో అధికార పక్షం ఏకంగా రూ.4 కోట్లు వెచ్చించి, పులివెందుల నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా ఒప్పందం కుదుర్చుకున్న ఓ కిరాయి ముఠాను దించి మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టింది. తరతమ భేదం లేకుండా దాడులు చేస్తూ భయోత్పాతం సృష్టించి ఏకపక్ష పోలింగ్‌ సాధించుకుంది.

● బద్వేలులోనూ ఇదే తరహా పరిస్థితి పునరావృతమైంది. స్థానికులతో ఏమాత్రం సంబంధం లేని బయటి వ్యక్తులు రంగంలోకి దిగి, విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు.

క్లస్టర్ల ఎత్తివేత వెనుక ‘ఏకపక్ష’ ఎత్తుగడ !

సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల సౌకర్యార్థం క్లస్టర్లు ఏర్పాటు చేసి, నాలుగైదు పంచాయతీలకు కలిపి ఒక చోట నామినేషన్లు స్వీకరించేవారు. కానీ, ఇప్పుడు ఆ పాత పద్ధతికి మంగళం పాడి, మండల కేంద్రంలోనే అన్ని పంచాయతీల నామినేషన్లు ఒకేచోట నిర్వహించాలనే కుట్రకు అధికార పక్షం తెరలేపింది. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం సైతం ‘భద్రతా కారణాల’ పేరుతో వత్తాసు పలుకుతోంది. అన్ని పంచాయతీల నామినేషన్లు ఒకే చోట జరిగితే.. పోలీసులు, కిరాయి రౌడీలు, గుండాలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష అభ్యర్థులను సులభంగా అడ్డుకోవచ్చనేది పాలకపక్షం పన్నాగమని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. వెరసి.. పాలకులు, ఖాకీలు, కిరాయిమూకల కుమ్మక్కుతో జిల్లాలో ప్రజా స్వామ్యం నవ్వులపాలవుతోంది.

స్థానిక ఎన్నికల్లో డబ్బులిచ్చి రౌడీయిజం..

బరితెగిస్తున్న అధికార పక్షం

నామినేషన్ల అడ్డగింత నుంచి

పోలింగ్‌ ఏజెంట్ల నిలువరించడం దాకా ‘ప్యాకేజీ’ దందా

కడపలో రూ.4 కోట్లు కుమ్మరించిన పాలకపక్షం..ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు బేరసారాలు

సర్పంచ్‌ పదవి ఏకగ్రీవానికి రూ.5లక్షల రేటు కట్టిన కొందరు ఖాకీలు!

మున్సిపల్‌, ప్రాదేశిక (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల్లో కిరాయి గ్యాంగ్‌ల దౌర్జన్యాలతో ఏకపక్ష ఫలితాలు రాబట్టడంతో, ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ ‘ఆ కాంట్రాక్ట్‌ మాకే అప్పగించండి’ అంటూ కొందరు పోలీసు అధికారులు తెరపైకి వస్తుండటం విస్తుగొలుపుతోంది. సర్పంచ్‌ పదవులకు పోటీ చేయాలనుకునే అధికార పార్టీ నేతలతో కొందరు ఖాకీలు రహస్య సమావేశాలు జరుపుతున్నారు. ‘ప్రాదేశిక ఎన్నికల తరహాలోనే మిమ్మల్నీ సర్పంచ్‌లుగా గెలిపించే బాధ్యత మాది.. మాకెంత ఇస్తారు?’ అంటూ మైదుకూరు, జమ్మలమడుగు, కడప సబ్‌–డివిజన్ల పరిధిలోని కొందరు అధికారులు నేరుగా బేరసారాలకు దిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మైదుకూరు సబ్‌–డివిజన్‌ పరిధిలోని ఇద్దరు ‘ట్రిపుల్‌ స్టార్‌’ (సీఐ స్థాయి) అధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్పంచ్‌గా ఏకగ్రీవం చేయాలంటే రూ.5 లక్షలు ఇవ్వాల్సిందేనని ఆశావహులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement