● పాత క్లస్టర్ కేంద్రాల్లోనే
నామినేషన్లు స్వీకరించాలి
● డీపీఓకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి వినతి
కడప కార్పొరేషన్: రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఆయన జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ)కి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ కడప జిల్లాలో గతంలో అనుసరించిన విధానం ప్రకారమే.. అభ్యర్థులందరికీ అందుబాటులో ఉండే పాత క్లస్టర్ కేంద్రాల్లోనే నామినేషన్లు స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రస్తుతం అధికార పార్టీకి అనుకూలంగా మండల కేంద్రాలు లేదా వారి ప్రాబల్యం ఉన్న గ్రామాలకు క్లస్టర్ కేంద్రాలను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆరోపించారు. దీనివల్ల ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు, అక్రమాలకు పాల్పడేందుకు ఆస్కారం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి గతంలో ఉన్న క్లస్టర్ కేంద్రాలనే కొనసాగించేలా తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు.


