కడప అర్బన్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి సకాలంలో అందించే చిన్న సహాయం కూడా ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలదని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామ్ గోపాల్ పిలుపునిచ్చారు. మన కళ్లముందు ఒక మనిషి ప్రాణం కోసం పోరాడుతున్నప్పుడు చట్టపరమైన ఇబ్బందులు, పోలీసు విచారణ, ఆసుపత్రి లాంఛనాల గురించి ఆలోచిస్తూ సహాయం చేయడానికి వెనుకాడకూడదని సూచించారు. ప్రమాద బాధితుడిని సకాలంలో ఆసుపత్రికి చేర్చడం ద్వారా ఒక కుటుంబానికి తీరని దుఃఖాన్ని దూరం చేయవచ్చని, ఒక కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ప్రాణాలను నిలబెట్టవచ్చని తెలిపారు. బుధవారం సాయంత్రం జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన ఛాంబర్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామ్ గోపాల్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచి మనసున్న సహాయకుల (గుడ్ సమారిటన్) హక్కులు, రోడ్డు ప్రమాద బాధితుల రక్షణకు సంబంధించిన పత్రమైన (గుడ్ సమారిటన్ అండ్ యాక్సిడెంట్ విక్టిమ్ ప్రొటెక్షన్ చార్టర్) చార్టర్ గురించి ఆయన వివరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రోడ్డు ప్రమాద బాధితులకు, వారికి స్వచ్ఛందంగా సహాయం చేసే వ్యక్తులకు చట్టపరమైన రక్షణ కల్పించినట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి జాప్యం లేకుండా తక్షణ అత్యవసర వైద్యం అందించాలని, పోలీసు విచారణ లేదా ఇతర చట్టపరమైన ప్రక్రియలు పూర్తికాలేదనే కారణంతో చికిత్సను నిరాకరించరాదని స్పష్టం చేశారు. వైద్యం ప్రారంభించడానికి ముందుగా ఎలాంటి నగదు చెల్లింపులు చేయాలని కోరరాదని, బాధితుడి ప్రాణాలను కాపాడటమే ఆసుపత్రుల మొదటి ప్రాధాన్యంగా ఉండాలని పేర్కొన్నారు.
సహాయం చేసిన వారిని ఇబ్బంది పెట్టకూడదు..
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్వచ్ఛందంగా ఆసుపత్రికి తీసుకెళ్లి సహాయం చేసే వ్యక్తిని మంచి మనసున్న సహాయకుడిగా (గుడ్ సమారిటన్) పరిగణిస్తారని జడ్జి తెలిపారు. బాధితుడిని ఆసుపత్రిలో చేర్చిన వెంటనే సహాయం చేసిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోవచ్చని, తన పేరు, చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాలు వెల్లడించాల్సిన తప్పనిసరి అవసరం లేదని వివరించారు. స్వచ్ఛందంగా వెల్లడించాలనుకుంటే మాత్రమే ఆ వివరాలు ఇవ్వవచ్చన్నారు. సహాయం చేసిన వ్యక్తిని ఆసుపత్రిలో నిర్బంధించరాదని, బాధితుడి వైద్య ఖర్చులు చెల్లించాలని బలవంతం చేయరాదని, ఆసుపత్రి సిబ్బంది వారితో మర్యాదగా, గౌరవంగా వ్యవహరించాలని తెలిపారు. అనవసర ప్రశ్నలతో వేధించడం, సహాయం చేసినందుకు ఇబ్బందులకు గురిచేయడం చేయకూడదని స్పష్టం చేశారు. ఆసుపత్రులు ప్రమాద బాధితులకు తక్షణ చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చూపరాదని, పోలీసు ప్రక్రియలు లేదా ఇతర లాంఛనాల కోసం వైద్యం ఆలస్యం చేయకూడదని జడ్జి తెలిపారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రమాద బాధితుల హక్కులు లేదా సహాయకుల హక్కులకు భంగం కలిగితే సంబంధిత ఆసుపత్రిలోని నోడల్ అధికారి లేదా వైద్య పర్యవేక్షకుడిని సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఇందుకోసం సంబంధిత అధికారి పేరు, ఫోన్ నంబరు, ఈ–మెయిల్ వివరాలను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు (యాక్సిడెంట్) వంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను కాపాడేందుకు ప్రజలు వెంటనే ముందుకు వచ్చి స్పందించాలని, అలాగే సమాజంలో ప్రతి ఒక్కరితో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు కూడా తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా తెలిపారు.
సహాయం చేసే వారికి చట్టపరమైన రక్షణ
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామ్‌గోపాల్


