ప్రాణాలు తీస్తున్న బైక్‌ మోజు | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీస్తున్న బైక్‌ మోజు

Nov 12 2026 12:37 AM | Updated on Nov 12 2026 12:37 AM

● వారం రోజుల్లో 3 రోడ్డు ప్రమాదాలు ● ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

ఖాజీపేట : యువతలో మితిమీరుతున్న బైక్‌ మోజు, క్షణకాలపు సరదా.. వారి జీవితాలకే ముగింపు పలుకుతోంది. స్నేహితులతో కలిసి బైక్‌లపై షికార్లు కొట్టడం, మిత్రుల ప్రోత్సాహంతో బైక్‌లను గాల్లో తేలుస్తూ నడపడం నేటి యువతకు అలవాటుగా మారింది. కానీ, ఆ వేగమే మృత్యుపాశంగా మారుతుందని గ్రహించేలోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఖాజీపేట మండలంలో గత వారం రోజుల్లో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాలే ఇందుకు సజీవ సాక్ష్యం. ఈ ప్రమాదాల్లో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఖాజీపేట మండలంతో పాటు టౌన్‌ పరిధిలోనూ విద్యార్థులు, యువకులు బైక్‌లపై విచ్చలవిడిగా చక్కర్లు కొడుతున్నారు. కొందరు యువకులైతే ఏకంగా బైక్‌ సైలెన్సర్లను తొలగించి, రోడ్లపై పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఒకే బైక్‌పై ముగ్గురు, నలుగురు కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణించడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఇటు పోలీసులు గానీ, అటు యువకుల తల్లిదండ్రులు గానీ దీనిని అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. యువత వాహనాలు నడిపేటప్పుడు ’స్వయం వేగ నియంత్రణ’ పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. కేవలం పోలీసులు ఫైన్లు వేసినంత మాత్రాన మార్పు రాదని, తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

ఆశలు చిదిమేసిన ప్రమాదాలివే.

4వ తేదీన : చెన్నూరు గాంధీనగర్‌కు చెందిన ఆమూరి రోహిత్‌ (21) తన మిత్రులతో కలిసి ఖాజీపేటలోని అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చాడు. దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణమైన క్రమంలో కొండపేట క్రాస్‌ వద్ద బైక్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రోహిత్‌ అక్కడికక్కడే మృతి చెందగా, అతని మిత్రులు తీవ్రంగా గాయపడ్డారు.

5వ తేదీన : చెమ్ముళ్ళపల్లె గ్రామానికి చెందిన ములపాక హరికృష్ణ (20) తన స్నేహితులతో కలిసి బైక్‌పై ఖాజీపేటకు బయలుదేరాడు. జాబిలీ రెస్టారెంట్‌ సమీపంలోకి రాగానే వేగాన్ని అదుపు చేయలేక రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హరికృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వెనుక కూర్చున్న ఇద్దరు మిత్రులు తీవ్ర గాయాలపాలయ్యారు.

8వ తేదీన : పుల్లూరు గ్రామానికి చెందిన సుబ్బరాయుడు (32) రాత్రి వేళ బైక్‌పై వస్తుండగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని తక్షణమే కడప రిమ్స్‌కు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement