వృద్ధురాలి అదృశ్యంపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి అదృశ్యంపై ఫిర్యాదు

Nov 12 2026 12:37 AM | Updated on Nov 12 2026 12:37 AM

చక్రాయపేట : మండలంలోని కుప్పం గ్రామం, చిన్నమోరయ్యగారిపల్లెకు చెందిన మాచిరెడ్డి పార్వతమ్మ (65) అనే వృద్ధురాలు గత ఐదు రోజులుగా కనిపించడం లేదని ఆమె కుమారుడు విశ్వనాథరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేంపల్లెలోని తన చెల్లెలి ఇంటికి వెళ్లి వస్తానని పార్వతమ్మ చెప్పడంతో, కుటుంబ సభ్యులు ఆమెను బైక్‌పై బురుజుపల్లె బస్‌ స్టాప్‌ వద్దకు తీసుకెళ్లి బస్సు ఎక్కించారు. అయితే, మధ్యాహ్నం సమయంలో తన అన్న పనిమీద వేంపల్లెకు వెళ్లి చిన్నమ్మ ఇంటి వద్ద అమ్మ గురించి ఆరా తీయగా, ఆమె అక్కడికి రాలేదని చెప్పారని విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు.బంధువుల ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో చక్రా యపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. విశ్వనాథరెడ్డి ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రాజశేఖరరెడ్డి వెల్లడించారు. పార్వతమ్మ ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం అందిస్తామని, సమాచారం తెలిస్తే వెంటనే చక్రాయపేట పోలీసులకు తెలియజేయాలని ఆమె కుమారులు కోరారు.

బాలుడు అదృశ్యం

కడప అర్బన్‌ : కడప నగరంలోని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మాసాపేటకు చెందిన హరీష్‌ అనే వ్యక్తి కుమారుడు సందీప్‌ (8) అదృశ్యమయ్యాడు. ఈనెల 10వ తేదీన ఉదయం ఇంటి నుంచి పిల్లలతో ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు కడప టూటౌన్‌ సీఐ సెల్‌ నంబర్‌ 9121100513కు గానీ, ఎస్‌ఐ సెల్‌ నంబర్‌ 9121100517కు గానీ సమాచారం అందించాలని సీఐ శ్రీహరి కోరారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం..

రాగి తీగ చోరీ

పెండ్లిమర్రి : మండలంలోని కొత్తగంగిరెడ్డిపల్లె పంచాయతీ రామసుబ్బారెడ్డి కాలనీ సమీపంలో మంగళవారం రాత్రి దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన రైతు రామసుబ్బారెడ్డికి చెందిన వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి, అందులోని రాగి తీగను అపహరించారు. ఇటీవల చుట్టుపక్కల పొలాల్లోని బోర్ల వద్ద కూడా రాత్రిపూట కేబుల్‌ వైర్లు చోరీకి గురైనట్లు రైతులు తెలిపారు. వరుస దొంగతనాలపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ

సంబేపల్లె : మండల పరిధిలోని ఎస్‌.సోమవరం, దేవళంపేట, అగ్రహారం, దేవపట్ల ఎస్టీ కాలనీ సమీపంలోని రైతుల పొలాల్లో అమర్చిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. దీనిపై బాధిత రైతులు బుధవారం సంబేపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరకొర నీళ్లతో కష్టపడి పంటలు సాగు చేసుకుంటున్న తరుణంలో, గుర్తుతెలియని వ్యక్తులు ట్రాన్స్‌ఫార్మర్లను దొంగిలించడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి దొంగలను పట్టుకోవాలని, కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement