● బ్యాలెట్ పేపర్లు ఎత్తుకుపోయి రిగ్గింగ్‌కు పాల్పడలేదా?
● మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డిని
ప్రశ్నించిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
జమ్మలమడుగు : ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలు, రిగ్గింగ్‌లకు పాల్పడలేదా అని ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డిని ప్రశ్నించారు. నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం వల్లే మీ కుటుంబ సభ్యులు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా, ముద్దనూరు ఎంపీటీసీగా గోవర్ధన్‌రెడ్డి, జమ్మలమడుగు జెడ్పీటీసీగా రాజేష్‌రెడ్డి, 25వ వార్డు కౌన్సిలర్‌గా మీరు ఏ విధంగా ఎన్నికయ్యారో ప్రజలంతా గమనిస్తున్నారని మండిపడ్డారు. తనపై నారాయణరెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్‌గా బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాబోయే తరానికి తప్పుడు సంకేతాలా?
చాలా కాలం తర్వాత బయటకు వచ్చి ప్రెస్‌మీట్ పెట్టిన నారాయణరెడ్డి, రాబోయే తరానికి దౌర్జన్యా లు, రిగ్గింగ్‌లు చేయమనే తప్పుడు సంకేతాలిచ్చేలా మాట్లాడటం సిగ్గుచేటని రామసుబ్బారెడ్డి అన్నారు. గతంలో ఏం జరిగిందనేది కాకుండా, ప్రస్తుత ఎన్నికల్లో జరిగిన అరాచకాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతో ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో సైతం పోలింగ్ ఏజెంట్లను మెడపట్టుకుని బయటకు లాగి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, మహిళల పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి దారుణాలు జరిగాయా అని నారాయణరెడ్డిని ప్రశ్నించారు.
సంక్షేమం అమలు చేస్తే రిగ్గింగ్ ఎందుకు?
రిగ్గింగ్‌లు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలు చేయ మని మీ పిల్లలను ప్రోత్సహిస్తున్నారా అనే దానికి సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో ’డబుల్ ఇంజన్ సర్కార్’, ’సూపర్ సిక్స్ సూపర్ హిట్’ అని గొప్పలు చెప్పుకుంటున్నారని, నిజంగానే సంక్షేమ పథకాలన్నీ అమలు చేసి ఉంటే ఎన్నికల్లో రిగ్గింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని నిలదీశారు. ప్రజలకు మీపై నమ్మకం లేకనా, లేక ప్రజలు మీకు ఓట్లు వేయరనే భయంతోనా ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారని ప్రశ్నించారు.
ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజల మద్దతు ఉండదని భయపడ్డారని రామసుబ్బారెడ్డి విమర్శించారు. అందుకే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి, రాజేష్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డిలను ఒక్కో మండలానికి కేటాయించి గుండాలతో పోలింగ్ బూత్‌ల వద్ద భయానక వాతావరణం సృష్టించారని ఆరోపించారు. ఓటింగ్ జరగకుండా అడ్డుకుని రిగ్గింగ్ చేసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించలేకపోయినందుకు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు.


