కూటమి పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం

Nov 12 2026 12:37 AM | Updated on Nov 12 2026 12:37 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : రెండున్నరేళ్ల కూటమి పాలనలో ప్రజా విశ్వాసం కోల్పోయిన నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల నుంచి పోలింగ్‌, కౌంటింగ్‌ వరకు పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకాలు సృష్టించి ఓటర్ల మనోభావాలను దెబ్బతీశారని, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు రాజారెడ్డి, సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్‌ విమర్శించారు. బుధవారం కడప నగరంలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో సిపిఐ, సిపిఎం నగర కమిటీల ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు నిరసనగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ప్రజల పాత్ర ఏమీ లేదని, పోలీసులు, కూటమి అరాచక శక్తుల పాత్రే ఉందని, అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. దాడులు, దౌర్జన్యాలతో ప్రజలను రానివ్వకుండా అభ్యర్థులను, ఏజెంట్లను భయపెట్టి నిర్బంధించి రిగ్గింగ్‌, రీసైక్లింగ్‌ ద్వారా పోలింగ్‌ చేసుకున్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. డబ్బుల పంపకం, హెచ్చరికలు, పోలీసు కేసులు, బెదిరింపులకు పాల్పడి అప్రజాస్వామిక పద్ధతుల్లో ఎన్నికలు జరుపుకొన్నారని విమర్శించారు. రాష్ట్ర చర్రితలో ఎన్నడూ జరగని విధంగా స్థానిక సంస్థల ఎన్నికలల్లో అక్రమాలు జరిగాయని డీఐజీ కోయ ప్రవీణ్‌ మొదలుకొని ఎస్పీలు, డీఎస్పీలు, సిఐ, ఎస్‌ఐ లు, కూటమి అధికార పార్టీ అరాచకాలకు వంత పాడారని విమర్శించారు. రిగ్గింగును అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను, ఏజెంట్లను పోలీసులు కొట్టి నిర్బంధించారని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేశామనే నమ్మకం ఉంటే అధికారపార్టీ రిగ్గింగుకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తన స్వతంత్రతను కోల్పోయి అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి యన్‌.వెంకట శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగసుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్యం, కేసి బాదుల్లా, మద్దిలేటి, మనోహర్‌ రెడ్డి సీపీఎం నేతలు అన్వేష్‌, దస్తగిరిరెడ్డి, కామనూరు శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement