జనగణన రెండోదశకు ఏర్పాట్లు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

జనగణన రెండోదశకు ఏర్పాట్లు చేపట్టాలి

Nov 11 2026 3:33 AM | Updated on Nov 11 2026 3:33 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : జనగణన–2027 రెండవ దశను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, అవసరమైన ముందస్తు ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా జనగణన అధికారి వెంకటపతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌, పీజీఆర్‌ఎస్‌ హాలులో.. రెండవ దశ జనగణన నిర్వహణలో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటపతి హాజరై పలు సూచనలు జారీచేశారు. జనాభా గణనలో ప్రతి ఒక్కరి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయా లని స్పష్టం చేశారు. దేశ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పన, విధాన నిర్ణయాలు, నిధులు, వనరుల కేటాయింపులో జనగణన గణాంకాలు కీలకమని పేర్కొన్నారు. కేంద్ర జనగణన సహాయ సంచాలకులు సుప్రేజ్‌ పాల్గొన్నారు. జిల్లా జనగణన ఇన్‌చార్జి మోహన్‌ రమణ జనగణన రెండవ దశకు సంబంధించిన ముందస్తు సన్నద్ధత, విధివిధానాల కార్యాచరణపై దశ్య ప్రదర్శన ద్వారా వివరించారు.

జోన్‌ వ్యాప్తంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు

కడప కోటిరెడ్డి సర్కిల్‌: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని కడప జోన్‌ వ్యాప్తంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నామని కడప జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కిషోర్‌ తెలిపారు. తిరుపతి నుంచి పది, చిత్తూరు నుంచి పది, అన్నమయ్య నుంచి 30, వైయస్సార్‌ కడప 65, కర్నూలు 80, నంద్యాల 170 అనంతపురం 20, సత్య సాయి నుంచి 10 బస్సులు నడపనున్నామన్నారు. అలా గే అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడపనున్నామని ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు. ఈ ప్రత్యేక సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం ఉందని వివరించారు.

భగవద్గీత కంఠస్థ పోటీలు

కడప సిటీ : గీతా జయంతిని పురస్కరించుకొని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఉమ్మడి కడప జిల్లా కార్యాలయ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు మూడు భాగాలలో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం అసిస్టెంట్‌ డాక్టర్‌ గోపి బాబు తెలిపారు. ఈ మేరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విభాగం ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు, రెండవ విభాగంలో పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు, మూడవ విభాగంలో 18 నుంచి 45 ఏళ్ల వారికి పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీలు కడపజిల్లాకు సంబంధించి డిసెంబరు 6వ తేది ఆదివారం కడపలోని టీడీడీ కల్యాణ మండపంలో, అన్నమయ్య జిల్లాకు సంబంధించి డిసెంబరు 13న మదనపల్లెలోని సెవెన్‌ హిల్స్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూలులో ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 91107 79066 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.

ఉత్సవాలు ప్రారంభం

పెండ్లిమర్రి : పొలతల శైవ క్షేత్రంలో మంగళవారం ఆలయ ఛైర్మన్‌ రాజారెడ్డి, ఈఓ క్రిష్ణానాయక్‌ల ఆధ్వర్యంలో కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏటా ఆనవాయితీగా నిర్వహించే ఆకాశదీపాన్ని ప్రారంభించామని వారు తెలిపారు. ముందుగా వేదపండితుల ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణంలోని ధ్వజ స్తంభం వద్ద ఆకాశదీపాన్ని వెలిగించారు.

‘సహకార’ఎన్నికలకు

సిద్ధం కావాలి: డీసీఓ

కడప అగ్రికల్చర్‌: జిల్లావ్యాప్తంగా త్వరలో నిర్వహించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నిర్వహణకు అందరు సిద్ధం కావా లని డీఈఓ వెంకటసుబ్బయ్య సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని డీసీఈ కార్యాలయంలో ఓటర్ల జాబితా తయారీ, ప్రాదేశిక నియోజక వర్గాల విభజనపై సొసైటీల సీఈఓలు, సబ్‌ డివిజనల్‌ కో ఆపరేటివ్‌ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ పరిధిలోని ప్రాదేశిక నియోజకవర్గాల విభజనను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement