కడప అర్బన్: మెడికో లీగల్ కేసుల నిర్వహణలో వైద్యులు, పోలీస్ అధికారుల మధ్య పరస్పర సమన్వయం ఎంతో కీలకమని, కేసుల దర్యాప్తులో పారదర్శకత, కచ్చితత్వం పెంచేందుకు చట్టపరమైన శిక్షణ అవసరమని జీజీహెచ్ ఇన్‌చార్జ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ యు.శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు, రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుల సూచనల మేరకు కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన వైద్యులు, పోలీసులకు నిర్వహించిన రెండు రోజుల ప్రత్యేక మెడికో లీగల్ వర్క్‌షాప్ మంగళవారంతో విజయవంతంగా ముగిసింది. కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో నవంబర్ 9, 10 తేదీల్లో జరిగిన ఈ శిక్షణా కార్యక్రమానికి రెండు జిల్లాల వైద్యాధికారులు, పోలీస్ అధికారులు, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం అధ్యాపకులు, పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.జమున పర్యవేక్షణలో ఈ సదస్సుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించారు.
మాక్ కోర్టుతో సాక్ష్యం చెప్పే
విధానంపై లైవ్ డెమో
వర్క్‌షాప్‌లో రెండో రోజైన మంగళవారం వైద్య విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీమాక్ కోర్టుశ్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెడికో లీగల్ కేసులకు సంబంధించి వైద్యులు కోర్టులో సాక్షులుగా హాజరైనప్పుడు ఎలాంటి నిబంధనలు పాటించాలి? న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో సాక్ష్యం ఎలా చెప్పాలి? వైద్య నివేదికలను ఏ విధంగా చట్టబద్ధంగా సమర్పించాలి? వంటి అంశాలను లైవ్‌గా నటించి ఆచరణాత్మకంగా వివరించారు. సాక్ష్యాధారాల ప్రాముఖ్యత, వైద్యుల లీగల్ బాధ్యతలపై పాల్గొన్న వారికి పూర్తి అవగాహన కల్పించారు.
మెడ్లీపర్ యాప్ వినియోగంపై అవగాహన
ఈ సదస్సులో బాధితులకు నిర్వహించాల్సిన వైద్య పరీక్షలు, సంబంధిత పత్రాల నిర్వహణ, సాక్ష్యాధారాల సేకరణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా, మెడికో లీగల్ ప్రక్రియను డిజిటలైజ్ చేస్తూ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన మెడ్లీపర్ యాప్ ను ఎలా వినియోగించాలో ప్రొజెక్టర్ ద్వారా వివరించారు.
కేసుల విచారణలో పారదర్శకతే లక్ష్యం
చిన్నపాటి పొరపాట్లకు కూడా ఆస్కారం లేకుండా వైద్య పరీక్షలు, నివేదికల తయారీని నిబంధనల ప్రకారం చేపట్టాల్సిన అవసరాన్ని ఈ శిక్షణా కార్యక్రమం స్పష్టం చేసింది. ఈ వర్క్‌షాప్ ద్వారా వైద్యులు, పోలీసుల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావడంతో పాటు కేసుల దర్యాప్తులో కచ్చితత్వం పెరుగుతుందని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎం. బాబు, డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ ఆనంద్ మోహన్, జిల్లా నోడల్ అధికారి డాక్టర్ అనుదీప్ ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సు అనంతరం పాల్గొన్న వైద్యులకు సర్టిఫికెట్లు అందజేశారు.
రియలిస్టిక్ ‘మాక్ కోర్టు’తో
ఆచరణాత్మక శిక్షణ
కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో ముగిసిన రెండు రోజుల ప్రత్యేక వర్క్‌షాప్
న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పే విధానం మరియు ‘మెడ్లీపర్’ యాప్‌పై
అవగాహన


