ఖాజీపేటలో దొంగల (కార్తీక) టాస్క్‌ | - | Sakshi
Sakshi News home page

ఖాజీపేటలో దొంగల (కార్తీక) టాస్క్‌

Nov 11 2026 3:33 AM | Updated on Nov 11 2026 3:33 AM

ఖాజీపేట: ఒకే ఆలయాన్ని టార్గెట్‌ చేసుకుని దొంగలు వరుసగా ఏడో సారి దోచుకున్న ఘటన ఖాజీపేట మండలంలో తీవ్ర సంచలనంగా మారింది. గతంలో దొంగతనం జరిగినప్పుడల్లా సీసీ కెమెరాలు లేవని చేతులెత్తేసిన పోలీసులకు, ఈసారి సీసీ కెమెరాలున్నా దొంగలు పడటం పెద్ద సవాల్‌గా మారింది.

జాతీయ రహదారే దొంగలకు రూట్‌ మ్యాప్‌

మండల పరిధిలోని భూమాయపల్లె గ్రామం జాతీయ రహదారికి ఆనుకుని ఉంది. హైవే పక్కనే గ్రామస్థులు ఎంతో భక్తిశ్రద్ధలతో భీమలింగేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. అయితే ఆలయం రోడ్డు పక్కనే ఉండటం దొంగలకు బాగా కలిసిసొచ్చింది. గడిచిన 5 సంవత్సరాలుగా, ముఖ్యంగా భక్తుల రద్దీ మరియు కానుకలు ఎక్కువగా ఉండే కార్తీక మాసం సమయంలోనే దొంగలు ఇక్కడ ఎక్కువగా చోరీలకు తెగబడుతున్నారు. గుడిలోకి రావడం, హుండీ పగులగొట్టడం, అందులోని నగదును ఊడ్చేయడం వీరికి పరిపాటిగా మారింది. తాజాగా సోమవారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు, ముందుగా సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉండేందుకు విద్యుత్‌ సరఫరాను కట్‌ చేశారు. ఆ తర్వాత గర్భగుడి తాళాలు పగులగొట్టి, హుండీలోని కానుకలను దోచుకెళ్లారు. మంగళవారం ఉదయం ఆలయ కమిటీ సభ్యులు వచ్చి చూసి దిగ్భ్రాంతి చెందారు.

సీసీ కెమెరాలున్నా ఖాతరు చేయని దొంగలు

గడచిన ఐదేళ్లలో ఈ గుడిలో సుమారు 7 సార్లు దొంగతనం జరిగినట్లు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మూడు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు గుడి చుట్టూ సీసీ కెమెరాలు బిగించుకోవాలని సూచించారు. దాంతో కమిటీ వారు లక్షలు ఖర్చు చేసి కెమెరాలు పెట్టించారు. కానీ, ఈసారి దొంగలు టెక్నాలజీని వాడుతూ కరెంట్‌ కట్‌ చేసి మరీ లూటీకి పాల్పడటం గమనార్హం.

వరుస చోరీలపై పోలీసులు స్పందించరా?

దొంగలు ఒకే ఆలయాన్ని వరుసగా టార్గెట్‌ చేసుకుంటున్నా ఖాజీపేట పోలీసులు సరైన రీతిలో స్పందించడం లేదని, నైట్‌ పెట్రోలింగ్‌ కూడా నిర్వహించడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. పోలీసుల నిఘా లోపం వల్లే దొంగలు పదే పదే ఇక్కడ రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఈ వరుస చోరీల మిస్టరీని ఛేదించి, దొంగలను పట్టుకుని ఆలయానికి రక్షణ కల్పించాలని భూమాయపల్లె గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఒకే ఆలయంలో 7వ సారి చోరీ

విద్యుత్‌ కట్‌ చేసి మరీ హుండీ లూటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement