కడప అర్బన్ : కడప నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఓ ఇంటిపై సస్పెండైన కానిస్టేబుల్ విల్ఫ్రేడ్ దాడి చేసి వీరంగం సృష్టించాడు. కడప కమాండ్ అండ్ కంట్రోల్‌లో ఉన్న సమయంలో కానిస్టేబుల్ విల్ఫ్రేడ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. గతంలో ప్రకాష్ నగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఇలానే అనేక మంది ఇళ్లపై ఇదే కానిస్టేబుల్ దాడి చేశాడు. కొద్ది రోజుల క్రితం రిమ్స్‌లో నమోదైన కేసులో కానిస్టేబుల్ విల్ఫ్రేడ్ రిమాండ్‌కు వెళ్లి బయటకు వచ్చాడు. తాజాగా హెచ్.బి కాలనీలో ఓ ఇంటిపై దాడి చేయడంతో బాధితులు కడప డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కావాలనే తమను టార్గెట్ చేస్తూ తమ ఇళ్లపై దాడి చేస్తున్నారని సంపత్, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విల్ఫ్రేడ్ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతున్నాయి.
ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి
కడప ఎడ్యుకేషన్ : డీఎస్సీ 2003 ఉపాధ్యాయులను పాత పెన్షన్ పరిధిలోనికి తీసుకు వస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో డీఈఓ కార్యాలయంలో 2003 డిఎస్సి ఉపాధ్యాయుల సౌకర్యార్థం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు కోరారు. ఈ విషయమై మంగళవారం డీఈఓ షేక్ షంషుద్దీన్‌ను కలిసి యూటీఎఫ్ నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు వై రవికుమార్, జిల్లా కార్యదర్శి ఏడి దేవదత్తం, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం బాబు, ఆర్ సుబ్రహ్మణ్యం, కే వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోరాట ధీరుడు టిప్పు సుల్తాన్
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు టిప్పు సుల్తాన్ అని ఆప్ కి ఆవాజ్ కార్యదర్శి షేక్ మక్బూల్ బాషా పేర్కొన్నారు. మంగళవారం కడప నగరంలోని ఆప్‌కీ ఆవాజ్ కార్యాలయంలో టిప్పు సుల్తాన్ 276వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మతం, కులం, ప్రాంతం అనే భేదాలకు అతీతంగా ప్రజల ఐక్యతను, మతసామరస్యాన్ని గౌరవించిన చారిత్రక వ్యక్తిగా ఆయనను గుర్తుంచుకోవాలన్నారు.


