చింతకొమ్మదిన్నె: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి, ఆమె ఆత్మహత్యకు కారణమైన కేసులో కడప పోక్సో ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. నిందితునికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 15,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి అధికారికంగా వెల్లడించారు. సీఐ కథనం మేరకు.. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం వెంకట్రాంపల్లె గ్రామానికి చెందిన బవిగడ్డ విష్ణు గోపాల్ (నిందితుడు) ఒక మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాంతో ఆ బాలిక గర్భం దాల్చింది. తనను వివాహం చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయగా నిందితుడు నిర్దయాత్మకంగా నిరాకరించాడు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆ బాలిక 2018 సెప్టెంబరు 2వ తేదీన కడప–కృష్ణాపురం రైల్వే స్టేషన్ల మధ్య డౌన్ లైన్ రైల్వే ట్రాక్‌పై (కిలోమీటర్ నెం.260 వద్ద) వేగంగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.
మలుపు తిరిగిన దర్యాప్తు
తొలుత ఈ ఘటనపై కడప రైల్వే పోలీసులు సిఆర్‌పిసి సెక్షన్ 174 కింద సాధారణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే అనంతరం దర్యాప్తులో లభించిన షాకింగ్ ఆధారాల మేరకు ఈ కేసును చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు నిందితునిపై ఎస్సీ, ఎస్టీ (నిరోధక) చట్టంతో పాటు పోక్సో చట్టం–2012 సెక్షన్–6 కింద కేసు నమోదు చేసి పక్కా ఆధారాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొమ్మినేని వేణుగోపాల్ మైనర్ బాలిక తరఫున కోర్టులో బలమైన వాదనలు వినిపించారు.
బాలిక ఆత్మహత్యకు కారణమైన
నిందితుడికి 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష
లైంగిక దాడితో గర్భవతిని చేసి, పెళ్లికి నిరాకరించిన విష్ణు గోపాల్‌పై నేరం రుజువు
రూ.15,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు


