సాక్షి టాస్క్ ఫోర్స్: చింతకొమ్మదిన్నె మండలం పరిధిలోని బుగ్గవంక ప్రధాన కాలువ రోడ్డుపై ఉన్న విలువైన గ్రావెల్ మట్టిని అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా తవ్వేసి అమ్ముకుంటున్నారు. కడప–చిత్తూరు జాతీయ రహదారి నుంచి బోడెద్దులపల్లె మీదుగా పెద్దకాంపల్లె వరకు వెళ్లే ఈ రోడ్డుపై గత వారం రోజులుగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నా.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఇప్పపెంట, పెద్దకాంపల్లె వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇప్పపెంట చెరువును గుల్ల చేసిన నేతలే ఇప్పుడు ఈ దోపిడీకి తెరలేపారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఉపయోగపడే ఈ కాలువ రోడ్డును ధ్వంసం చేస్తూ, తవ్విన గ్రావెల్‌ను సమీపంలోని వాణిజ్య, నివాస స్థలాలకు తరలించి ఇప్పటికే రూ.10 లక్షలకు పైగా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పంటల రస్తాను పాడు చేయవద్దని రైతులు అడ్డుకుంటే దర్జాగా బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు మండిపడుతున్నారు.
బుగ్గవంక డీఈ రమణ వివరణ:
ఈ వ్యవహారంపై బుగ్గవంక డ్యామ్ డీఈ రమణను ’సాక్షి’ వివరణ కోరగా.. కాలువ రోడ్డుపై మట్టిని తొలగించిన మాట వాస్తవమేనన్నారు. అయితే ఈ పనులకు ప్రభుత్వ నిధులు గానీ, వర్క్ ఆర్డర్లు గానీ జారీ కాలేదని స్పష్టం చేశారు. సాగునీటి సంఘాల వారే కాలువ రోడ్డును బాగు చేసుకోవడానికి మట్టిని తొలగించారని, తిరిగి వారి సొంత ఖర్చులతోనే గ్రావెల్ వేసి బాగు చేస్తామని చెప్పారని డీఈ వెల్లడించారు. రోడ్డు బాగు చేసే సాకుతో లక్షల రూపాయల ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటుంటే, అధికారులు సాగునీటి సంఘాల పేరిట సమర్థించడంపై స్థానిక రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులు
కాలువ రోడ్డును తవ్వేసి అమ్ముకుంటున్న టీడీపీ నాయకులు


