చెన్నూరు (వల్లూరు): రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా చెన్నూరు మండలంలో పోలీస్ యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. మండల పరిధిలో సమస్యాత్మకంగా గుర్తించిన పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం పోలీస్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీ చేశారు. కడప డీఎస్పీ భవాని, చెన్నూరు సీఐ చాంద్ బాషా తమ సిబ్బందితో కలిసి చెన్నూరు, ఉప్పరపల్లి, రాచనాయపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను నేరుగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక భద్రత, ఓటర్ల రాకపోకల మార్గాలు, సీసీ కెమెరాల నిఘా, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల రోజున గ్రూపు తగాదాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై సిబ్బందిని అప్రమత్తం చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలతో ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు.
భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీసిన డీఎస్పీ భవాని, సీఐ చాంద్ బాషా
పంచాయతీ ఎన్నికల వేళ అవాంఛనీయ
ఘటనలు జరిగితే సహించేది లేదని హెచ్చరిక


