కడప కోటిరెడ్డి సర్కిల్ : కనుమలోపల్లి – భాకరాపేట రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని రైలు నుంచి సుమారు 35ఏళ్ల వయసు గల వ్యక్తి కిందపడ్డాడు. అతన్ని రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడని కడప రైల్వే ఎస్‌ఐ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతుడి చేతిపై పచ్చబొట్టు ఉందన్నారు. తెలుపు రంగు చొక్కా, స్కైబ్లూ కలర్ నిలువు గీతాలు, నలుపు రంగు ప్యాంటు ధరించాడన్నారు. మృతి చెందిన వ్యక్తి ఆనవాళ్లు తెలిసిన వారు కడప రైల్వే పోలీస్ వారిని సంప్రదించాలని ఆయన కోరారు. వివరాలకు 9247575624, 8500226717 నంబర్లలో సంప్రదించాలన్నారు.
రిమ్స్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో వైద్యసేవలను పొందేందుకు ఈనెల 8వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి (35) చేరాడు. చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని కడప రిమ్స్ మార్చురీలో వుంచారు. తగిన ఆధారాలతో సంప్రదిస్తే మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని రిమ్స్ అధికారులు తెలియజేశారు.
అనాథ మృతదేహానికి
అంత్యక్రియలు
కడప అర్బన్ : నగర శివార్లలోని కేంద్ర కారాగారం సమీపంలో గల శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన బత్తల నాగన్న (65) అనే సాధువు అనారోగ్యంతో మృతి చెందారు. మృతునికి బంధువులెవరూ లేకపోవడంతో, రిమ్స్ పోలీసుల విజ్ఞప్తి మేరకు ‘శ్రీ కాశీ విశ్వనాథ సేవా సమితి’ ముందుకొచ్చింది. సమితి ప్రతినిధులు మానవత్వంతో ఆ సాధువును తమ ఆత్మబంధువుగా భావించి, హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు గుండ్లకొండ రవి, రెడ్డి లక్ష్మణ్, పుట్టా పురుషోత్తం, సురేష్, టైలర్ రవి, రాఘవ, శ్రీ చరణ్ పాల్గొన్నారు.
యువతి బలవన్మరణం
జమ్మలమడుగు రూరల్ : సెల్‌ఫోన్ ఎక్కువగా ఉపయోగించవద్దని తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జమ్మలమడుగు మండలంలోని చిటిమిటి చింతల (పాటి) గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వేంపల్లె మండలం బక్కన్నగారిపల్లె గ్రామానికి చెందిన బుక్కే స్వాతి (21) సెల్‌ఫోన్ వాడుతుండటంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో కలత చెందిన స్వాతి, శనివారం జమ్మలమడుగు మండలంలోని చిటిమిటి చింతల గ్రామంలో నివసిస్తున్న తన పెద్దమ్మ నాన్కి భాయి ఇంటికి వచ్చింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి స్వాతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి రత్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.


