జమ్మలమడుగు రూరల్ : స్థానిక ఎన్నికల్లో అధికార కూటమి నాయకులు సృష్టించిన అరాచకాలను రాష్ట్ర ప్రజలతో పాటు జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ మరచిపోరని, కూటమి పాలనలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి (పీఆర్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం జమ్మలమడుగు బైపాస్ రోడ్డులోని శివానీ కల్యాణ మండపంలో కార్యకర్తలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు కూటమి నేతలు గుండాయిజానికి తెరతీశారని విమర్శించారు. నిత్యం నీతులు పలికే బాబాయి ఆదినారాయణరెడ్డి, అబ్బాయి భూపేష్‌రెడ్డిల అసలు స్వరూపం ఎన్నికల నాటికి బయటపడిందన్నారు. క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీకి ఉన్న ఆదరణను చూసి, ఓటమి భయంతోనే వారు అరాచకాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. నామినేషన్ కేంద్రాల వద్ద, ప్రతి పోలింగ్ బూత్ వద్ద కర్రలు, రాళ్లతో తిరుగుతూ పాతకాలపు ఫ్యాక్షన్ కంటే ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోకుండా ఓటరు స్లిప్పులను బలవంతంగా లాక్కుని, దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ పూర్తిగా కూటమి ప్రభుత్వానికి దాసోహమై, ఈ ప్రజాస్వామ్య అపహాస్యానికి సహకరించాయని ధ్వజమెత్తారు.పెద్దముడియం మండలం పెద్దపసుపల గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి నేతలు యథేచ్ఛగా బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌కు పాల్పడటం దుర్మార్గమన్నారు. కూటమి అరాచకాలకు ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హితవు పలికారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలని, అందుకు తగిన దిశానిర్దేశం కార్యకర్తలకు చేసినట్లు పీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నపురెడ్డి గిరిధర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


