ధర్మానికి.. అధర్మానికి మధ్య ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

ధర్మానికి.. అధర్మానికి మధ్య ఎన్నికలు

Nov 1 2026 4:55 AM | Updated on Nov 1 2026 4:55 AM

కడప కార్పొరేషన్‌: దుర్మార్గానికి, సన్మార్గానికి మధ్య మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూటమి నేతల దుర్మార్గం, హింస పరాకాష్టకు చేరాయన్నారు. ప్రజా స్వామ్యానికి మాయని మచ్చలా... హిట్లర్‌, బ్రిటీషు పాలనను తలదన్నేలా ఎన్నికలు నిర్వహణ ఉందన్నారు. ఎమర్జెన్సీ కంటే మించిన స్థాయిలో అరాచకం రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ది వచ్చేలా తీర్పునివ్వాలని కోరారు.ఈ ప్రభుత్వం వచ్చాక నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలు, వెబ్‌ కాస్టింగ్‌ చేయాలని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని, ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

కడప ప్రశాంతతను కాపాడుకోవాలి: అంజద్‌బాషా

కడప నగరం శాంతికి, మత సామరస్యానికి ప్రతీక అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి కడపలో ఎన్ని అరాచకాలు చేశారో, నామినేషన్లు వేయనీయకుండా టీడీపీ రౌడీ మూకలు ఎలాంటి దమనకాండ కొనసాగించారో ప్రజలంతా చూశారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై రెండు హత్యాయత్నాలు జరిగాయని, చాలామందిపై దాడులు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసి ఉంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపడానికి ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి, 13 మంది కార్పొరేటర్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మాజీ మేయర్‌ పాకా సురేష్‌ పాల్గొన్నారు.

విచారణ జరపాలి

కడప కార్పొరేషన్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్య ప్రక్రియను అణగదొక్కడానికి మున్సిపల్‌ కమిషనర్‌, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేతో కుమ్మక్కవుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. శనివారం స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు ఆయన లేఖ రాశారు. ప్రతి బూత్‌కు చెందిన 200 బ్యాలెట్‌ పత్రాలను చట్ట విరుద్ధంగా దారి మళ్లించి నేరుగా ఎమ్మెల్యే నివాసానికి పంపుతున్నారని ఆరోపించారు. కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 362 బూత్‌లు ఉన్నందున, ఈ స్థాయిలో పత్రాల మళ్లింపు అనేది ఫలితాలను తారు మారు చేయడానికి, రిగ్గింగ్‌ చేయడానికి ఉద్దేశ పూర్వకంగా భారీగా జరుగుతున్న ప్రయత్నాన్ని సూచిస్తుందన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌, స్థానిక ఎమ్మెల్యే పాత్రపై తక్షణమే, నిష్పక్షపాత విచారణకు ఆదేశించాలని, మొత్తం 361 బూత్‌లలోని బ్యాలెట్‌ పేపర్‌ పంపిణీ రికార్డులు, లాగ్‌లు, స్ట్రాంగ్‌రూమ్‌ సామగ్రిని భద్రపరచాలన్నారు. ఈ అవకతవకలకు పాల్పడిన అధికారులు, వ్యక్తులందరిపై క్రమశిక్షణా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలలో సీసీ టీవీ నిఘా, వెబ్‌ కాస్టింగ్‌, బందోబస్తు ఏర్పాట్లను, స్ట్రాంగ్‌ రూమ్‌లో సీసీటీవీ నిఘాను కొనసాగించా లని కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement