● టోకెన్లు పంచడంపై పలువురి ఆగ్రహం
● గంటల తరబడి క్యూలో ఉన్న అందని
భోజనం
కడప కార్పొరేషన్ : భోజనాని కోసం క్యూలైన్లలో వేచిఉన్న వీరంతా వరదబాధితులు అనుకుంటే పొరపడినట్లే.. ఆదివారం జరిగే పోలింగ్ విధుల్లో వీరంతా పాల్గొననున్నారు. పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బందికి సరిపడినంత భోజనాన్ని సరఫరా చేయడంలో కడప నగరపాలక సంస్థ తీవ్రంగా విఫలమైంది. పోలింగ్‌కు సంబంధించి పోలింగ్ సామాగ్రిని తీసుకెళ్లడానికి సుమారు 2వేలమందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది ఆర్ట్స్ కళాశాలకు చేరుకున్నారు. వారందరికీ కడప కార్పొరేషన్ ఆధ్వర్యంలో మధ్యా హ్నం భోజనం అందించాల్సి ఉంది. కాగా పోలింగ్ సిబ్బందికి తగినంత మేర ఆహారం ఏర్పాటు చేసి, అదే సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేయాల్సిన నగరపాలక కమిషనర్.. అధికారులు ఆ పని చేయలేక చేతులెత్తేశారు. మధ్యాహ్న భోజనానికి టోకెన్లు ఇవ్వడంపైనా పలువురు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులకు ఒకటి, పురుషులకు మరొకటి రెండు కౌంటర్లు మాత్రమే ఏర్పాటు చేయడంతో గంటల కొద్దీ క్యూలో నిల్చోలేక వారు అవస్థలు పడ్డారు. కడప చుట్టుప్రక్కలకు చెందిన వారైతే ఈ భోజనం తినలేమని అందుబాటులో ఉన్న హోటళ్లను ఆశ్రయించారు.
ఇతర ప్రాంతాల నుంచి కడపకు వచ్చిన వారు స్థానికంగా ఎక్కడ హోటళ్లు, భోజన రెస్టారెంట్లు ఉన్నాయో తెలుసుకోలేక నరకయాతన అనుభవించారు. కొందరికి అన్నం దొరికితే పప్పు లభించలేదు. అన్నం పప్పు ఉంటే రసం దొరక్కుండా పోయింది. వందలాది మంది భోజనం లేక కడుపు మాడ్చుకోవాల్సి వచ్చింది. మహిళా ఉద్యోగులకు భోజనం దొరక్కపోవడంతో అక్కడున్న బొంగులను ప్లేట్లలో పెట్టుకొని ఆరగించారు. ఎన్నికల సిబ్బందికి భోజనానికి అయ్యే ఖర్చును ఎన్నికల కమిషన్ భరిస్తుంది. కానీ అధికారుల కక్కుర్తి వల్లే పోలింగ్ సిబ్బందికి భోజనం తక్కువ వచ్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరిపడినంతగా భోజనం ఏర్పాటు చేయలేకపోయిన నగరపాలక అధికార యంత్రాంగంపై పోలింగ్ విధుల్లో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసమర్థులు, చేతగానివాళ్లకు ఎన్నికల నిర్వహణ అప్పగిస్తే ఇలాగే ఉంటుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.


