వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇంటిపై దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇంటిపై దాడి

Nov 1 2026 4:49 AM | Updated on Nov 1 2026 4:49 AM

మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీలోని 12వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మూలే రేణుక ఇంటిపై శనివారం రాత్రి టీడీపీ వర్గీయులు దాడి చేశారు. రేణుక భర్త భరత్‌ కుమార్‌ రెడ్డి కి చెందిన కంపెనీలో పనిచేసే అకౌంటెంట్‌ ఎస్‌. శ్రీనివాసులరెడ్డిని టిడిపి వర్గీయులు కొట్టి, ఆదివారం జరిగే పోలింగ్‌ లో ఏజెంట్లుగా కూర్చుంటే చంపుతామని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కుటుంబ సభ్యులను బెదిరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి 8 గంటల ప్రాంతంలో స్థానిక కడప రోడ్డులోని భరత్‌ కుమార్‌ రెడ్డి కార్యాలయం నుంచి అకౌంటెంట్‌ శ్రీనివాసులు రెడ్డి ఇంటికి వెళుతుండగా టీడీపీ వర్గీయులు అతనిపై దాడి చేసి ఓటర్లకు డబ్బు పంచుతున్నావా అంటూ కొట్టారు. అతను భయంతో దగ్గరలో ఉన్న భరత్‌ కుమార్‌ రెడ్డి ఇంట్లోకి పరిగెత్తాడు. టీడీపీ వర్గీయులు పెద్ద సంఖ్యల భరత్‌ కుమార్‌ రెడ్డి ఇంటి వద్దకు చేరుకుని గేటు తీసేందుకు ప్రయత్నించారు. భరత్‌ కుమార్‌ రెడ్డి కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా బయటకు వస్తే చంపుతామని బెదిరించారు. సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా భరత్‌ కుమార్‌ రెడ్డి కుటుంబ సభ్యులు టీడీపీ వర్గీయుల దాడి గురించి అర్బన్‌ ఎస్‌ఐ కత్తి వెంకటరమణ కు వివరించారు. తమ అకౌంటెంట్‌ ను కొట్టి తమ ఇంటిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ వారు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అక్కడ గుమిగూడి ఉన్న వారందరినీ పంపించి వేశారు. అర్బన్‌ సీఐ హాజీ వలి, ఎస్సై వెంకటరమణ సిబ్బంది వీధిలో తిరిగి టీడీపీ వర్గీయుల కోసం గాలించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో పరిసరాల్లో ఉన్న దుకాణాలను కూడా మూయించారు. రేణుక ఇంటిపై జరిగిన దాడిపై మూలే భరత్‌ కుమార్‌ రెడ్డి కుటుంబ సభ్యులు కళ్యాణి, విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంద మంది దాకా తమ ఇంటిపై దాడి చేశారని, ఆదివారం జరిగే పోలింగ్‌ లో ఏజెంట్లుగా కూర్చుంటే చంపుతామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు ప్రాణ రక్షణ కల్పించి దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement