సాక్షి టాస్క్‌ఫోర్స్ : పులివెందుల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం రాత్రి భారీగా అల్లరి మూకలు మోహరించాయి. ఆదివారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు సృష్టించి లబ్ధి పొందాలని టీడీపీ గూండాలను సిద్ధం చేసింది. ఇప్పటికే పార్టీ కార్యాలయం వెనుక టీడీపీ నేతలు పెద్ద ఎత్తున కర్రలు, రాడ్లు సిద్ధం చేశారు. పోలింగ్ బూత్ లను ఆక్రమించుకుని రిగ్గింగ్ చేసుకునేందుకు పన్నాగం పన్నుతున్నారు. ఓటర్లు బయటకు రాకుండా అల్లర్లకు కుయుక్తులు పన్నుతున్నారు.
ఆర్‌కే వ్యాలీలో ఘనంగా గూగుల్ డెవ్‌ఫెస్ట్
వేంపల్లె : రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) పరిధిలో ఉన్న ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో గూగుల్ డెవ్‌ఫెస్ట్–2026 ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ‘దృష్టి–ఇన్నోవేట్ విత్ ఏఐ’ అనే ఇతివృత్తంతో శుక్ర, శనివారాలు ఈ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు యూనివర్సిటీ ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మద్దాలి లక్ష్మీనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.విజయ ప్రకాష్, శ్రీకాకుళం డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్, ఒంగోలు డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ సండ్ర, నూజివీడు డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.ఎస్.ఎస్.వి. గోపాలరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ వంటి నూతన పరిజ్ఞానంపై పట్టు సాధించాలని సూచించారు. అనంతరం ప్రొఫెసర్ ఎం.ఎల్.ఎన్.రావు, గూగుల్ డెవలపర్ గ్రూప్ విజయవాడ ప్రతినిధులు సంయుక్తంగా డెవ్‌ఫెస్ట్–2026ను ప్రారంభించారు. రెండు రోజుల సదస్సులో భాగంగా డాక్టర్ వి.ఎస్.కె. మూర్తి, గొర్లపాటి మురళీకృష్ణ, వడ్లమాని మధు, మనం నాగ మణికంఠ, కళ్యాణ్ దీక్షిత్ తదితర సాంకేతిక నిపుణులు ప్రసంగించారు. మొదటి రోజు ఏఐ ఏజెంట్ వర్క్‌షాప్, రెండో రోజు టెక్నికల్ టాక్స్, హ్యాకథాన్ నిర్వహిస్తూ విద్యార్థులకు ప్రాయోగిక పరిజ్ఞానాన్ని అందించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులు, వక్తలకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమ కన్వీనర్లుగా శ్యామ్ పెరిక, డాక్టర్ ఎస్.మహబూబ్ జిలాని, డాక్టర్ రత్నకుమారి చల్లా, కో–కన్వీనర్లుగా డాక్టర్ బి.వి.సుధాకర్ రెడ్డి, డాక్టర్ పి.రవికుమార్, డాక్టర్ ఎం.భాస్కరయ్య, డాక్టర్ జె.దీప్తి, జి.ఎస్.సుందర్ వ్యవహరించారు.
అన్నప్రసాద వితరణకు రూ.10.01 లక్షలు విరాళం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహణ కోసం టీటీడీ బోర్డు సభ్యులు నన్నప్పనేని సదాశివరావు రూ. 10.01 లక్షల విరాళం అందజేశారు. శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ బోర్డు సభ్యులు నన్నప్పనేని సదాశివరావు, ఆయన సతీమణి కలిసి విరాళానికి సంబంధించిన డీడీని టీటీడీ కార్యనిర్వహణ అధికారి ముద్దాడ రవిచంద్రకు అందచేశారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట ఆలయ ఉప కార్యనిర్వహణ అధికారిణి ప్రశాంతి పాల్గొన్నారు.


