గుత్త మొత్తంగా ఓటర్లను అమ్మేశారు | - | Sakshi
Sakshi News home page

గుత్త మొత్తంగా ఓటర్లను అమ్మేశారు

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

● అధికారులు రూ.6వేల నుంచి

రూ.6కోట్ల వరకు తీసుకున్నారు

● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

ప్రొద్దుటూరు : ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నెముక ఎన్నికలేనని, ఎన్నికలు లేకపోతే ప్రజాస్వామ్యం ఉంటుందా అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. ఆయన బుధవారం తన క్యాంప్‌ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత దేశ గొప్పతనాన్ని గురించి ప్రతి ఒక్కరూ విద్యార్థి దశలో 20 ఏళ్లపాటు చదువుకున్నారన్నారు. ఇలాంటి గొప్ప దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానపరచడానికి టీడీపీనేతలతోపాటు అధికార యంత్రాంగం తోడైందన్నారు. నియోజకవర్గంలోని 2,47,000 ఓట్లు ఉంటే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులందరూ కలసి గుత్త మొత్తంగా అమ్మేశారన్నారు. స్థాయిని బట్టి అధికారులు రూ.6 వేల నుంచి రూ.6కోట్ల వరకు తీసుకున్నారని ఆరోపించారు. ఇలా చేయడానికి ప్రభుత్వ యంత్రాంగానికి, టీడీపీ నేతలకు సిగ్గు అనిపించలేదా అన్నారు. అందరూ కలసి ప్రజాస్వామ్యానికి వెన్నెముకను విరిచేశారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అవమాన పరిచినందుకు తాను కోపంతో మాట్లాడితే కొంత మంది అధికారులను జత చేసి మున్సిపల్‌ కమిషనర్‌ ఖండించారని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. టోకెన్‌ సిస్టం ద్వారా డబ్బు తీసుకోలేదని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని రాచమల్లు ప్రశ్నించారు. ప్రొటోకాల్‌కు విరుద్ధంగా మాట్లాడిన కమిషనర్‌ ప్రమాణానికి ఎందుకు ముందుకు రాకూడదన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల అక్రమాలపై 4 ప్రశ్నలను సంధిస్తున్నట్లు చెప్పారు.ౖ116 ఏళ్ల ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చరిత్రలో 52 వార్డులతో పాటు చైర్మన్‌ స్థానాన్ని ఏవిధంగా ఏకగ్రీవం చేశారు? టీడీపీ ఎమ్మెల్యే వరద కుటుంబీకుల దౌర్జన్యాలు, రౌడీయిజానికి పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం రక్షణ కల్పించడం వల్లే 16 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ సహా ఇతర పార్టీలు నామినేషన్లు వేయలేకపోయాయాన్నరు. వైఎస్సార్‌సీపీ పోరాడి 36 వార్డుల్లో నామినేషన్లు వేస్తే.. మొదటిరోజు పత్రాలన్నీ బాగున్నాయని చెక్‌ లిస్ట్‌ ఇచ్చిన అధికారులే, మరుసటి రోజు స్క్రూటినీలో తన భార్య రమాదేవి మినహా 35 మంది నామినేషన్లను అక్రమంగా తిరస్కరించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. స్క్రూటినీ హాల్‌లోకి వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డితో పాటు కౌన్సిలర్‌ అభ్యర్థులను పోలీసులు ఎందుకు రానివ్వలేదు? లోపలికి వెళ్లిన చైర్మన్‌ అభ్యర్థిపై టీడీపీ నేతలు దాడులు చేస్తుంటే పోలీసులు ఎందుకు మౌనం వహించారని ప్రశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులకు రూ.50 లక్షల టేబుల్‌ మనీతో పాటు, ప్రధాన అధికారికి హైదరాబాద్‌లో రూ.6 కోట్ల విలువైన స్థలాన్ని ఇచ్చారన్నారు. లేని ఓటు హక్కును చైర్మన్‌ అభ్యర్థి నంద్యాల రాఘవరెడ్డికి కల్పించినందుకు ఓ అధికారికి రూ.25లక్షలు ముట్టిందన్నారు. ఎన్నికల అధికారికి రూ.లక్ష, సహాయ ఎన్నికల అధికారులకు రూ.75వేలు, ఈఆర్‌ఓకు రూ.25వేలు, ఫొటో గ్రాఫర్‌కు రూ.20వేలు, కానిస్టేబుల్‌కు రూ.5వేలు, ఏఎస్‌ఐకి రూ.10వేలు, ఎస్‌ఐకి రూ.లక్ష, సీఐకి రూ.2లక్షలు, మున్సిపల్‌ కమిషనర్‌కు రూ.25లక్షలు, పోరెడ్డి నరసింహారెడ్డి నామినేషన్‌ డిస్‌క్వాలిఫై చేసిన అధికారికి రూ.15లక్షలు ముట్టజెప్పారన్నారు. ఈ తతంగా అంతా మున్సిపల్‌ ఆఫీసులోనే జరిగిందని, సాక్ష్యాలు దొరకకుండా సీసీటీవీ ఫుటేజీని సైతం మాయం చేశారు.

వారంతా ‘కరోనా కౌన్సిలర్లే’!

కరోనా సమయంలో పరీక్షలు రాయకుండానే విద్యార్థులను పాస్‌ చేసినట్లు, ఇప్పుడు గెలిచిన టీడీపీ కౌన్సిలర్లంతా ‘కరోనా కౌన్సిలర్లే’అని రాచమల్లు ఎద్దేవా చేశారు. వీరెవరూ ప్రజల ఓట్లతో గెలవలేదని, కేవలం ఉత్తీర్ణత పత్రాలు మాత్రమే పొందారన్నారు. జరిగిన అన్యాయంపై హైకోర్టు, సుప్రీంకోర్టు, లోకాయుక్తలను ఆశ్రయిస్తామని, ఒకవేళ ఇక్కడ తప్పించుకున్నా తమ ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి ఓబయ్య యాదవ్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఆయిల్‌ మిల్‌ ఖాజా, పార్టీ మండల కన్వీనర్‌ మార్తల ఓబుళరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement