వైర్ల దొంగల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

వైర్ల దొంగల హల్‌చల్‌

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

● కేబుల్‌ కట్‌ చేస్తుండగా పట్టుకున్న రైతులు

● పోలీసులకు అప్పగింత

ఖాజీపేట : అసలే వర్షాల్లేక, సాగు నీరు అందక అల్లాడుతున్న రైతులకు మోటార్ల కేబుల్‌ వైర్ల దొంగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. కష్టపడి ఉన్న పంటలనైనా కాపాడుకుందామని భావిస్తున్న తరుణంలో, వరుస దొంగతనాలతో రైతన్నలకు నష్టాన్ని మిగులుస్తున్నారు. వైర్లు దొంగిలిస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఇద్దరు దొంగలను స్థానిక రైతులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన ఖాజీపేట మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట గ్రామ పరిధిలో గత వారం రోజులుగా కేబుల్‌ దొంగల ముఠా విచ్చలవిడిగా రెచ్చిపోతోంది. గ్రామానికి చెందిన సుమారు ఐదుగురు రైతుల పొలాల్లోని వ్యవసాయ మోటార్లకు ఉండే కాపర్‌ కేబుల్‌ వైర్లను దొంగలు కట్‌ చేసి ఎత్తుకెళ్లారు. ఒక్కో మోటార్‌ వద్ద దాదాపు 20 మీటర్ల చొప్పున వైరును చోరీ చేశారు. దీంతో పంటలకు నీరందించేందుకు రైతులు ఒక్కొక్కరు రూ. 5,000 వరకు అప్పులు చేసి, తిరిగి కొత్త కేబుల్స్‌ బిగించుకోవాల్సి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం సమయంలో దొంగలు మళ్లీ కొత్తపేట పొలాల్లోకి చొరబడ్డారు. ముందుగా పాలకొలను సురేంద్రారెడ్డి పొలంలో కేబుల్‌ వైర్‌ను కట్‌ చేసి మూటగట్టారు. అనంతరం అక్కడి నుంచి వెళ్తూ, మార్గమధ్యలో ఉన్న కంచెంరెడ్డి అనిల్‌కుమార్‌ రెడ్డి పొలంలోని విద్యుత్‌ వైర్లను కట్‌ చేస్తుండగా స్థానిక రైతులు గమనించారు. వెంటనే అప్రమత్తమై దొంగలను చుట్టుముట్టి, వెంబడించి ఇద్దరిని పట్టుకున్నారు.దొంగలను నిలదీయగా.. గతంలో జరిగిన చోరీలు కూడా తామే చేసినట్లు అంగీకరించారు. తమతో పాటు ముఠాలో మరో ఇద్దరు ఉన్నారని, వారు పారిపోయినట్లు నిందితులు వెల్లడించారు. రైతులు వారి వద్ద నుంచి ఒక బైక్‌తో పాటు దొంగిలించిన వైర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఖాజీపేట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను, బైక్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement