మున్సిపల్‌ ఎన్నికల బందోబస్తుపై ఎస్పీ సమీక్ష | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఎన్నికల బందోబస్తుపై ఎస్పీ సమీక్ష

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

పులివెందుల రూరల్‌ : రానున్న మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ అధికారులను ఆదేశించారు. పులివెందుల సబ్‌ డివిజన్‌ పోలీస్‌ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఎన్నికల కోడ్‌ పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. నిరంతర గస్తీ చేపట్టాలని, వాహన తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మురళీ నాయక్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ నాగభూషణ్‌, సీఐలు పురుషోత్తమరాజు, శాంతిలాల్‌, ప్రసాదరావు, శంకర్‌రెడ్డి, నరసింహులు పాల్గొన్నారు.

ఆర్టీసీ డ్రైవర్‌పై

యువకుల దాడి

తనకల్లు : మండల పరిధిలోని కొక్కంటి క్రాస్‌లో బుధవారం ఆర్టీసీ డ్రైవర్‌ దుంగావత్‌ వేమన్న నాయక్‌పై నలుగురు యువకులు దాడి చేశారు. డ్రైవర్‌ను బస్సులో నుంచి కిందకు లాగి కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు కురిపించారు. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. దుంగావత్‌ వేమన్న నాయక్‌ కదిరి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా నాయక్‌ బుధవారం బెంగుళూరు నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో కదిరికి బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం మద్దయ్యగారిపల్లికి చెందిన విశ్వనాథ్‌, మధుకుమార్‌, సునీల్‌, రాములుతో పులికల్లు వద్ద బైక్‌లకు సైడ్‌ ఇవ్వలేదని గొడవ జరిగింది. అక్కడి నుంచి యువకులు ద్విచక్ర వాహనాల్లో ఆర్టీసీ బస్సును వెంబడించి, కొక్కంటిక్రాస్‌ వద్ద హైవేపై బైక్‌లను అడ్డంగా ఉంచి బస్సును ఆపేశారు. బస్సులో ఉన్న డ్రైవర్‌ను బలవంతంగా కిందకు దించి విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకోబోయిన స్థానికులను బెదిరించడంతో ఆగ్రహించిన వారు యువకులను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. యువకుల దాడిలో గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం తనకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా దాడికి పాల్పడిన యువకుల్లో విశ్వనాథ్‌ మొలకలచెరువు మండలం నయనాచెరువు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ తెలిపారు.

యువకుడు ఆత్మహత్యాయత్నం

మదనపల్లె టౌన్‌ : యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం పీటీఎం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలం లోని నిలువురాతి పల్లికి చెందిన ఖాదర్‌ సాబ్‌ కుమారుడు ఎస్‌ బాబు (30) కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగుమందు తాగాడు. కుటుంబీకులు అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి వైద్యం అందించి రుయాకు వెళ్లాలని రెఫర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement